హైదరాబాద్ నుంచి స్విగ్గీని తరిమేస్తాం: డెలివరీ బాయ్స్

హైదరాబాద్ నుంచి స్విగ్గీని తరిమేస్తాం: డెలివరీ బాయ్స్

హైదరాబాద్ కొండాపూర్ లో స్విగ్గి డెలివరి బాయ్స్ అందోళనకు దిగారు.  4 సంవత్సరాలుగా పనిచేస్తున్నా.. తమ వేతనంలో ఎలాంటి ఇంక్రిమెంట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా రోజుకు 22 గంటలు కష్టపడుతున్నా..   తమను యాజమాన్యం కనీసం మనుషులుగా కూడా గుర్తించట్లేదని బాధపడ్డారు.

నాలుగు కిలోమీటర్లు లోపు దూరానికి 45 రూపాయిలు కమిషన్ చెల్లించాలనే నిబంధన ఉండగా ఆ కమిషన్ ను రూ.20 వరకూ తగ్గించారని వారు అన్నారు. రూ.25 వేల కోట్ల టర్నోవర్ చేస్తున్న కంపెనీ తమకు జీతాలిచ్చే విషయంలో మాత్రం కక్కుర్తి పడుతోందని  అన్నారు.  పండుగ రోజులు, సెలవు దినాలు ఇలాంటివేవీ పట్టించుకోకుండా, ఖాళీ లేకుండా .. కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న తమను యాజమాన్యం మోసం చేస్తోందని అన్నారు.

ఎంత చదివినా సరైన  ఉద్యోగం దొరకక, కడుపు నింపుకునేందుకు డెలివరీ బాయ్ గా  చేరితే అటు కంపెనీ లో గానీ,  డెలివరీ ఇచ్చే హోటల్స్ గానీ, కస్టమర్స్ తమని మనుషులుగా గుర్తించడం లేదన్నారు. సాటి మనిషి నుంచి కనీస మర్యాద కూడా దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలో మొత్తం 35,000 మంది వరకూ డెలివరీ బాయ్స్ ఉన్నారని, వారికి కంపెనీ ఇచ్చే జీతం తప్ప ఇంకెలాంటి సదుపాయాలు లేవని అన్నారు.  కమిషన్ , ఇతర డిమాండ్ లను పరిష్కరించకపోతే రేపటి నుండి స్విగ్గి సేవలను ఆపేస్తామని, ధర్నా చేపడతామని అన్నారు.  తమకు సరైన జీతం ఇవ్వక పోతే అందోళనను మరో తెలంగాణ ఉద్యమంలా చేస్తామన్నారు. నిరసనలో పాల్గొంటే సస్పెండ్ చేస్తామని కంపెనీ బెదిరిస్తోందనీ.. అలాంటి పరిస్థితే వస్తే.. హైదరాబాద్ నుంచి స్విగ్గీని తిరిగి పంపిస్తామని హెచ్చరించారు.