ఉద్యోగుల్లేక ఆగిన స్విగ్గీ జీనీ సర్వీసు

ఉద్యోగుల్లేక ఆగిన స్విగ్గీ జీనీ సర్వీసు

బెంగళూరు: ఆర్డర్ పై వస్తువులను డెలివరీ చేయడానికి ఉపయోగించే స్విగ్గీ జీనీ సర్వీసులు హైదరాబాద్​, ముంబై, బెంగళూరులలో పని చేయట్లేదు.  ఈ నగరాల్లో  జీనీ పేరుతో అందిస్తున్న పిక్–​అప్​, డ్రాప్​–ఆఫ్ ​సర్వీసులు తాత్కాలికంగా ఆపేసినట్లు స్విగ్గీ తెలిపింది.  ఉద్యోగుల కొరత వల్లే  కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీనీ సర్వీసు టెంపరరీగా అందుబాటులో లేదని స్విగ్గీ యాప్​లో చెబుతోంది. 

ఎక్కడెక్కడ జీనీ సర్వీసు ఆగింది

ఏడు రోజులుగా జీనీ సేవలు అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫుడ్​–డెలివరీ, క్విక్​ కామర్స్​ బిజినెస్​ ఇన్​స్టామార్ట్​ల పైనే స్విగ్గీ ఫోకస్​ పెడుతోందని పేర్కొంటున్నాయి. జీనీ సేవలను 68 సిటీల్లో అందిస్తుండగా, 3 సిటీల్లో మాత్రమే నిలిచిపోయాయి. ఐపీఎల్​, పండుగల సీజన్​తో ఫుడ్​ డెలివరీ, ఇన్​స్టామార్ట్​ సర్వీసులకు డిమాండ్​ పెరగిందని,  ఫలితంగా వాటికి పెద్దపీట వేయాల్సి వస్తోందని స్విగ్గీ స్పోక్స్​ పర్సన్​ వెల్లడించారు. త్వరలోనే మళ్లీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

గిగ్​ వర్కర్ల కొరత వల్లే..

డెలివరీలు ఇచ్చే గిగ్​ వర్కర్ల(ఉద్యోగ భద్రత ఉండని సాదాసీదా పనులు చేసేవాళ్లు)కు జీతాలు పెంచడంలో కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో బైక్​ టాక్సీలు, ఈ–కామర్స్​ డెలివరీలవైపు రైడర్లు (డెలివరీ ఉద్యోగులు) మళ్లుతున్నారు. కరోనా టైమ్​లో ఉద్యోగావకాశాలు లేక.. డెలివరీ రైడర్లుగా పనిచేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఇప్పుడు మంచి ఉద్యోగాలు వస్తుండటంతో వారు అటువైపు వెళ్లిపోతున్నారని స్టాఫింగ్​ ఏజన్సీ టీమ్​ లీజ్ ​ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​ రీతూపర్ణ చక్రబర్తి చెప్పారు. బెంగళూరు, ముంబై, న్యూ ఢిల్లీ వంటి సిటీలలో క్విక్​ కామర్స్​ఇండస్ట్రీలో గిగ్​వర్కర్లకు డిమాండ్​ విపరీతంగా ఉందని పేర్కొన్నారు.