- రిజర్వాయర్‌లో పడి బాలిక మృతి
- మరో చోట ఈతకు వెళ్లి మృతిచెందిన బాలుడు
కీసర, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్టు చేయాలనే సరదా ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన ఆంటోనీ, టోనీతో పాటు మరో స్నేహితుడు సోమవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు.
ఇన్‌స్టాలో పోస్ట్ చేసేందుకు చెరువులో ఫొటోలు దిగాలని అనుకున్నారు. ఇందుకోసం చెరువులోకి దిగగా ఆంటోనీ(19), టోని(18) నీటిలో మునిగిపోయారు. భయపడిన మరో స్నేహితుడు బయటకు వచ్చి సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న వారికి సమాచారం ఇచ్చాడు.
వారు చెరువు వద్దకు వచ్చేసరికి ఇద్దరూ నీటిలో కనిపించలేదు. కీసర పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఆంటోనీ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
డ్యామ్ వద్ద ఫొటోలు దిగుతూ బాలిక..
ఇల్లంతకుంట: ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి బాలిక మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ రాజయ్య ఇంట్లో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులైన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన మహేశ్, స్వాతి దంపతులు కుమార్తె కీర్తన(10)తో కలిసి హాజరయ్యారు.
సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు సరదాగా అన్నపూర్ణ డ్యామ్‌ను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతున్న సమయంలో కీర్తన కాలుజారి రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసే గుంతలో పడిపోయింది. స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీసి అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కీర్తన మృతిచెందింది.
స్నేహితులతో ఈతకు వెళ్లి బాలుడు..
అల్వాల్: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు పురాతన బావి వద్దకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. అల్వాల్ ఖానాజిగూడకు చెందిన నితీశ్(8) తన స్నేహితులు గణేశ్, సూర్యతేజ, రోహిత్, అరవింద్‌తో కలిసి సోమవారం అదే ప్రాంతంలోని పాత బావి వద్దకు వెళ్లాడు.
ఈత రాకపోయినా స్నేహితులతో కలిసి బావిలోకి దిగాడు. ఒక్కసారిగా చేయి జారి నీటిలో పడి మునిగిపోయాడు. అల్వాల్, బోయిన్‌పల్లి పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బావిలో నితీశ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు.
గండిపేట చెరువులో యువకుడు గల్లంతు..
చేవెళ్ల: నేపాల్‌కు చెందిన ఓ యువకుడు గండిపేట చెరువులో గల్లంతయ్యాడు. నేపాల్‌కు చెందిన ఓం బహదూర్(28) మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పిస్తా హౌస్ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
సోమవారం హిమాయత్‌నగర్‌లోని మైసమ్మ దేవాలయం సమీపంలోని గండిపేట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో లోతుగా వెళ్లి గల్లంతయ్యాడు. మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, 3వ బెటాలియన్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
