V6 News

టేకాఫ్ అవుతున్న విమానంలో మంటలు..ఢిల్లీ ఎయిర్‌‌ పోర్ట్‌‌లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

టేకాఫ్ అవుతున్న  విమానంలో మంటలు..ఢిల్లీ ఎయిర్‌‌ పోర్ట్‌‌లో ప్రమాదం..  ఆరుగురికి గాయాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌‌లోని జ్యూరిచ్‌‌కు వెళ్లాల్సిన స్విస్ విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజన్‌‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ టేకాఫ్‌‌ను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌‌బస్ ఏ330 రకానికి చెందిన ఫ్లైట్ నెం. ఎల్‌‌ఎక్స్147, ఆదివారం తెల్లవారుజామున 1:08 గంటలకు రన్‌‌వేపై నుంచి టేకాఫ్ ప్రారంభించింది. 

ఆ సమయంలో ఇంజన్ విఫలమై మంటలు చెలరేగగా, విమానాన్ని నిలిపివేసి, ఎమర్జెన్సీ స్లైడ్‌‌ల ద్వారా ప్రయాణికులను రన్‌‌వేపైనే ఖాళీ చేయించినట్లు స్విస్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో 228 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇందులో  ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, మిగిలినవారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌‌వేస్ స్పందిస్తూ, ‘‘ప్రయాణికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత. ఇంజన్ వైఫల్యానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. మా సాంకేతిక నిపుణుల బృందం తనిఖీల కోసం ఢిల్లీకి చేరుకోనుంది”అని ప్రకటించింది. ప్రస్తుతం విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థ ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు.