ఇక ‘టీయాప్‘​తో అటెండెన్స్‌

ఇక ‘టీయాప్‘​తో అటెండెన్స్‌
  • ‘టీ- హాజరు’ యాప్ రిలీజ్‌చేసిన విద్యాశాఖ
  • టీచర్ల డుమ్మాలకు మొబైల్యాప్ తో చెక్
  • తొలిరోజు 20 వేల మంది హెచ్ ఎంల ఫోన్లలో డౌన్ లోడ్
  • నేటి నుంచి సీరియస్ గా అమలు చేయాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు:  భవిష్యత్​లో టీచర్లు రిజిస్టర్లలో సంతకాలు పెట్టాల్సిన పనిలేదు. బయోమెట్రిక్​పద్ధతిలో హాజరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే.. టీచర్ల డుమ్మాలకు చెక్​పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ‘టీ హాజరు’ అనే మొబైల్​యాప్​ను రిలీజ్​చేసింది. టీచర్లంతా ఇకపై ఈ మొబైల్​యాప్​ద్వారానే అటెండెన్స్​వేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ దృష్టంతా టీచర్లు, స్టూడెంట్స్ అటెంటెన్స్‌‌ పెంపుపైనే పెట్టింది. ఆగస్టు నెలంతా హాజరు మహోత్సవ్‌‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూనే, దానికి అనుబంధంగా పలు చర్యలు కొనసాగిస్తోంది. రెగ్యులర్‌‌గా స్కూల్‌‌కు వస్తేనే విద్యాప్రమాణాలు పెరుగుతాయని భావిస్తోంది. దీంట్లో భాగంగా ఈ నెల 23 నుంచి డీఈఓలు, ఎంఈఓలు ఉదయం స్కూల్‌‌ ప్రేయర్‌‌ సమయంలో తప్పనిసరిగా ఏదో ఒకచోట అటెండ్‌‌ కావాలని ఆదేశించగా, తాజాగా అటెండెన్స్‌‌ కోసం మూడు రోజుల క్రితం ఓ మొబైల్‌‌ యాప్‌‌ను రిలీజ్‌‌ చేసింది. ‘టీ- హాజరు’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌‌లో గవర్నమెంట్‌‌, లోకల్‌‌బాడీ స్కూల్స్‌‌తో పాటు కేజీబీవీ, మోడల్‌‌ స్కూల్స్‌‌, కేజీబీవీ, సొసైటీ గురుకులాలు, ఎయిడెడ్‌‌ స్కూళ్లు స్కూల్స్‌‌ పేర్లను ఎల్‌‌రోల్‌‌ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌‌ విజయ్‌‌కుమార్‌‌ హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్స్‌‌ను ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం10.30 గంటల వరకు ఎంతమంది టీచర్లు, విద్యార్థులు స్కూల్‌‌కు హాజరయ్యారనే వివరాలను పంపించాలని సూచించారు.

ఇక సాకులు చెప్పడం కుదరదు

స్టేట్‌‌లో మొత్తం 29 వేల సర్కారీ బడులుంటే గూగుల్‌‌ప్లే స్టోర్‌‌లో పెట్టిన శుక్రవారం నాడు 1,700 మంది హెడ్మాస్టర్లు ‘టీ హాజరు’ యాప్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకుని, రిజిస్టర్‌‌ అయ్యారు.  శని,ఆదివారాలు సెలవుదినాలు కావడంతో ఈ రెండు రోజుల్లో అందరూ దీన్ని ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఆదివారం నాటికి 20వేల వరకూ హెడ్మాస్టర్లు ఈ యాప్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. సోమవారం నుంచి ‘టీ హాజరు’ యాప్‌‌ ద్వారా తప్పనిసరిగా అటెండెన్స్ వివరాలు పంపించాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రస్తుతం12 జిల్లాల్లో బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ విధానం కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఆయా స్కూళ్లలో వాటిని వినియోగించడం లేదు. దీంతో ఇకపై కారణాలు చెప్పేందుకు వీలు లేకుండా మొబైల్‌‌ యాప్‌‌ ద్వారా అటెండెన్స్‌‌ విధానం తెచ్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల టీచర్ల డుమ్మాలకు చెక్‌‌ పెట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఆఫీసర్లు ప్రేయర్‌కు హాజరవ్వాల్సిందే 

స్కూల్‌ ప్రేయర్‌ సమయంలో ఎంఈఓ, డీఈఓలు తప్పనిసరిగా ఏదో ఓ స్కూలుకు ఆకస్మికంగా వెళ్లి, అటెండ్‌ కావాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్ కుమార్‌ మరోసారి ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం నుంచి దీన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చినా, 11 జిల్లాలకు చెందిన వారే ఈ ఆదేశాలు అమలు చేసినట్టు కమిషరేట్‌కు వివరాలు పంపించారు. నెలరోజుల నుంచి డీఈఓలు, ఎంఈఓలకు ఉన్నతాధికారులు సూచనలు ఇచ్చినా, వారు పట్టించుకోక పోవడంపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. దీంతో ప్రేయర్‌ సమయానికి స్కూల్స్‌ విజిట్‌ చేయకుంటే చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ మరోసారి హెచ్చరించారు.