హైదరాబాద్, వెలుగు: సిద్ధిపేట నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాలంటూ బీఆర్‌ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావుకు హైకోర్టు సూచించింది. సిద్ధిపేట నియోజకవర్గంలో రుణమాఫీని అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హరీశ్‌రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జె.రామచంద్రరావు, న్యాయవాది రామవరపు చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ .. రూ.2 లక్షలోపు రుణమాఫీకి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా అంతకంటే ఎక్కువ తీసుకున్నారనే కారణంగా పలువురికి అమలు చేయడం లేదన్నారు. సిద్ధిపేట నియోజకవరంలోని 5 మండలాల్లో 43,363 మంది అర్హులైన రైతులుండగా, 20,514 మందే లబ్ధి పొందారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ముందు సీఎస్కు వినతిపత్రం ఇవ్వాలని సూచిస్తూ విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
