భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన 41,257 రూపాయల టీ షర్ట్ ధరించిన రాహుల్.. ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తోన్న స్పందనను చూసి మోడీ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించింది.
‘‘ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. మనం బట్టల గురించి చర్చించవలసి వస్తే... ప్రధాని మోడీ ధరించిన సూట్ ధర రూ. 10 లక్షలు, గ్లాసెస్ రూ. 1.5 లక్షల గురించి చర్చించాల్సి ఉంటుంది. మరి వీటి గురించి బీజేపీ చర్చించాలనుకుంటుందా?’’ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుండగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రను కొనసాగనుంది.
