V6 News

రాష్ట్ర విద్యార్థులకు తైవాన్లో ఉద్యోగాలు

రాష్ట్ర విద్యార్థులకు తైవాన్లో ఉద్యోగాలు
  • పాత్​వే టు తైవాన్​ పేరుతో టీవర్క్స్, టాలెంట్​ తైవాన్​ ఒప్పందం
  • తొలి రౌండ్​ ఇంటర్వ్యూకు 20 ఇంజనీరింగ్​కాలేజీల విద్యార్థులు రిజిస్టర్​
  •  ఆరు నెలలు ఇక్కడే మాండరిన్​ నేర్చుకుని.. ఆ తర్వాత తైవాన్​లో ఉద్యోగం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తైవాన్​లో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ‘పాత్​ వే టు తైవాన్’ పేరిట టీవర్క్స్​ ప్రాంగణంలో తైవాన్​ సంస్థలు బుధవారం తొలి రౌండ్​ ఇంటర్వ్యూలను నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ప్రారంభించారు. మంత్రి సమక్షంలో టీ- వర్క్స్ సీఈఓ జోగిందర్ తనికెళ్ల, తైవాన్ ప్రభుత్వ సంస్థ టాలెంట్ తైవాన్ ప్రతినిధి ఈడెన్ లియెన్ ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కు చెందిన రియల్ టెక్, లాజిటెక్, మీడియాటెక్, విస్ట్రాన్, హిమాక్స్, కౌపాంగ్, ఐటీఆర్ ఐ సంస్థలు దీని కోసం ముందుకొచ్చాయి. 

ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడి విద్యార్థులను తైవాన్ కంపెనీలు మొదటి రౌండ్ లో ప్రాథమిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్ కు ఆహ్వానిస్తాయి. మొదటి విడతగా 20 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు. ఇంటర్వ్యూలు పూర్తిచేసుకున్న విద్యార్థులు 6 నెలల పాటు ఇక్కడ (చైనీస్) మాండరిన్ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాండరిన్ భాష, టెక్నికల్​ నాలెడ్జ్​ ఆధారంగా విద్యార్థులను జాబ్​లకు ఎంపిక చేసుకుని తైవాన్​కు తీసుకెళ్తారు.  

సవాళ్లను అధిగమిస్తేనే ఎదుగుదల: శ్రీధర్​ బాబు

భవిష్యత్తు​అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకుంటేనే యువత కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు.  కేవలం 2.2 కోట్ల జనాభా ఉన్న తైవాన్.. చిప్ ల తయారీ, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచమంతా ఆధారపడే స్థాయికి ఎదిగిందన్నారు.  తైవాన్ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని తెలంగాణ యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం టీవర్క్స్​ ఫౌండేషన్​కు రూ.కోటిన్నర నిధులను సీఎస్​ఆర్​ ఫండ్స్​కింద ఇస్తున్నట్టు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ చల్లవర్  ప్రకటించారు. 

 కాగా, తైవానీస్ యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల ప్రాముఖ్యతను వివరించే స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ వర్సిటీల్లో చేరితే వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో టీ హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ టీఎం ప్రవీణ్ కుమార్, తైవాన్ ప్రభుత్వ సంస్థ టాలెంట్ తైవాన్ సీఈవో జోనాథన్ లియావో, ప్రతినిధులు టెర్రా లిన్, ఇడెన్ లియెన్, హైదరాబాద్ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హెడ్​ ప్రొఫెసర్ శివరామకృష్ణ వంజరి తదితరులు పాల్గొన్నారు.