- నేడు ఇంగ్లిష్ టీమ్‌తో ఇండియా సెమీస్ ఫైట్
- పర్ఫెక్ట్ గేమ్‌తో ఫైనల్ చేరడమే టార్గెట్‌గా బరిలోకి
- రా.7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
ముంబై: వన్డే వరల్డ్ కప్ సహా టీమిండియాకు ఎన్నో మధుర విజయాలకు వేదికైన ప్రఖ్యాత వాంఖడే స్టేడియం మరో అద్భుత పోరాటానికి సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లోనూ ఈ రెండు జట్లే తలపడగా ముచ్చటగా మూడోసారి ఈ ‘క్లాసిక్’ పోరు రిపీట్ అవుతోంది. 2022లో ఇండియాను ఇంగ్లండ్ ఓడించగా, 2024లో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మూడో పోరులో ఈసారి పైచేయి ఎవరిదోనని ఉత్కంఠ రేపుతోంది.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇండియా బలమైన జట్లపై ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పూర్తి ఆధిపత్యం చెలాయించలేకపోయింది. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సెమీస్‌కు చేరుకుంది. నాకౌట్ గేమ్‌లో పర్ఫెక్ట్ ఆటతో ఇంగ్లిష్ టీమ్ పని పట్టి ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టాలని డిసైడైంది.
అంతా మెరవాల్సిందే..
సౌతాఫ్రికాతో సూపర్– 8 మ్యాచ్‌లో ఎదురైన పరాజయం తర్వాత ఇండియా పక్కాగా తన వ్యూహాలను మార్చుకుంది. టాపార్డర్‌లో లెఫ్టాండ్ బ్యాటర్ల బలహీనతలను అధిగమించేందుకు సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడం అద్భుతంగా పనిచేసింది. అరంగేట్రం చేసిన పదేండ్ల తర్వాత వెస్టిండీస్‌పై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. కానీ, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, అతడు తన సహజమైన విధ్వంసకర శైలిలో ఆడలేకపోతున్నాడు. ఈ సెమీఫైనల్‌లో అతడికి ఆత్మవిశ్వాసం ఇచ్చే ఇన్నింగ్స్ చాలా అవసరం. ఇక, టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత కాస్త చతికిలపడ్డాడు. తన మాజీ ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు.
ప్రస్తుత ముంబై ఇండియన్స్ స్టార్లు అయిన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మకు వాంఖడేపై మంచి పట్టుంది. సెమీస్‌కు ముందు నెట్స్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. టోర్నీ మొదట్లో మూడో స్థానంలో ఇబ్బంది పడిన తిలక్ ..మిడిల్ ఆర్డర్‌కు మారిన తర్వాత తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. నాకౌట్ మ్యాచ్ కాబట్టి బ్యాటర్లంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది.
ఇండియా బౌలింగ్‌లో బుమ్రా ఎప్పటిలాగే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే డెత్ ఓవర్లలో మిగతా బౌలర్లు మరికొంత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంది. వరుణ్ చక్రవర్తి తన లెంగ్త్‌ను కంట్రోల్ చేసుకోవాలి. చిన్న గ్రౌండ్ కాబట్టి స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ ఏమాత్రం లూజ్ బాల్స్ వేసినా ఇంగ్లండ్ బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడతారు. శివమ్ దూబేను ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా వాడటం కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇండియా తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు.
ఇంగ్లిష్ టీమ్‌తో ఇబ్బందే..
టోర్నీ ఆరంభంలోనే వెస్టిండీస్ చేతిలో ఓడినా ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకొని సెమీస్ చేరుకుంది. ముఖ్యంగా సూపర్–8 రౌండ్‌లో ఆ టీమ్ గొప్ప విజయాలు అందుకుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ప్రధానంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, సామ్ కరన్ వ్యక్తిగత పెర్ఫామెన్స్‌పై ఆధారపడింది. జట్టు డీలా పడ్డ ప్రతీసారి ఎవరో ఒకరు ఆదుకున్నారు. మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్ కోల్పోయి సతమతమవుతుండటం ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. బుమ్రా బౌలింగ్‌లో బట్లర్ రికార్డు (88 బాల్స్‌లో 79 రన్స్, 4 సార్లు ఔట్) ఆశాజనకంగా లేదు. ఈ కీలక మ్యాచ్‌లో బట్లర్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడా లేదా అనేది చూడాలి. బౌలింగ్‌లో ఇంగ్లిష్ టీమ్ బలంగా ఉంది. ముఖ్యంగా షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పట్టే జోఫ్రా ఆర్చర్ నుంచి ఆతిథ్య బ్యాటర్లకు ముప్పు ఉంది.
గతంలో శాంసన్‌ను మూడు సార్లు ఔట్ చేసిన ఆర్చర్‌పై అభిషేక్ శర్మ, తిలక్ వర్మ పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇక, ఇండియా ఓపెనర్లను కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్‌ను ప్రయోగించే చాన్స్ ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. మిడిల్ ఓవర్లలో లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎదుర్కోవడం ఇండియాకు పెద్ద సవాలు. ఇంగ్లండ్ డ్యాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను ఎంత త్వరగా కట్టడి చేస్తే ఇండియాకు అంత మంచిది. గతంలో సాల్ట్‌ను నాలుగు సార్లు ఔట్ చేసిన అర్ష్‌దీప్ మళ్లీ ఆ పని చేయాలి. న్యూజిలాండ్‌పై అదరగొట్టిన యంగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను పక్కనపెట్టి సీనియర్ పేసర్ జేమీ ఓవర్టన్‌ను ఇంగ్లండ్ తుది జట్టులోకి తీసుకురానుంది.
పిచ్/వాతావరణం
ఈ మ్యాచ్ కోసం వాంఖడేలోని ఏడో నంబర్ పిచ్‌ను కేటాయించారు. ఇది గ్రౌండ్ మధ్యలో ఉండటంతో రెండు వైపులా బౌండరీలు సమాన దూరంలో ఉంటాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఈ వికెట్‌పై ఎటువంటి మ్యాచ్‌లు జరగలేదు కాబట్టి ఇది తాజాగా ఉండే అవకాశం ఉంది. పిచ్‌పై పచ్చిక ఉండటం వల్ల మంచి బౌన్స్ లభిస్తుందని అంచనా. ఈ టోర్నీలో ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. గురువారం వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా):
ఇండియా: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
