డిఫాల్ట్ మిల్లర్లు కటకటాల్లోకి..సీఎంఆర్ బకాయిలపై అధికారుల కొరడా.. వెలుగు కథనానికి స్పందన

డిఫాల్ట్ మిల్లర్లు కటకటాల్లోకి..సీఎంఆర్ బకాయిలపై అధికారుల కొరడా.. వెలుగు కథనానికి స్పందన
  • పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 
  • ఐదుగురు మిల్లర్లు అరెస్ట్
  • పెద్దపల్లి జిల్లాలో  ఒకరిపై క్రిమినల్ కేసు
  • కరీంనగర్ జిల్లాలో మాత్రం ఆఫీసర్లు సైలెంట్!

కరీంనగర్, వెలుగు: కోట్లాది రూపాయల సీఎంఆర్(కస్టమ్ మిల్ల్డ్ రైస్) బకాయిలు ఎగవేసిన డీఫాల్ట్ రైస్ మిల్లర్లపై అధికారులు ఎట్టకేలకు చర్యలు ప్రారంభించారు. ఆర్‌‌ఆర్ యాక్ట్ అమలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేసి మిల్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. ‘అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ’ శీర్షికతో ఫిబ్రవరి 27న వెలుగు దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

దీనిపై ప్రభుత్వం స్పందించడంతో పాటు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎంఆర్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఐదుగురు మిల్లర్లను అరెస్ట్ చేశారు.

పెద్దపల్లి జిల్లాలో గురువారం మరో మిల్లర్‌‌పై కేసు నమోదు చేయడంతో డీఫాల్ట్ మిల్లర్లలో ఆందోళన నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో 48 మిల్లుల నుంచి రూ.218 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా, కరీంనగర్ జిల్లాలో పలు మిల్లుల నుంచి రూ.173 కోట్లు వసూలు కావాల్సి ఉంది.

గడువు ఇచ్చినా బేఖాతర్​..


బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల అండతో 2021 నుంచి 2023 వరకు మిల్లర్లు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బకాయిల వసూళ్లు ప్రభుత్వానికి సవాల్​గా మారాయి. పలుమార్లు గడువు ఇచ్చినా స్పందించకపోవడంతో ఫిబ్రవరి 24తో తుది గడువు ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డీఫాల్ట్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి అరెస్టులు ప్రారంభించారు.

పలు జిల్లాల్లో అరెస్టులు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌‌లో రూ.19.89 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో మిల్లు ఎండీ బండారి మారుతి, ఆయన భార్య బండారి శారదలను సుల్తానాబాద్ పోలీసులు ఈ నెల 8న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఇదే మిల్లు యాజమాన్యం కరీంనగర్ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి లక్ష్మీకల్యాణి, యాదగిరి స్వదేశీరావు నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ మోడ్రన్ రైస్ మిల్ 2022–23, 2024 సంవత్సరాలకు సంబంధించిన రూ.8 కోట్ల సీఎంఆర్ బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ శ్రీకళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 10న అరెస్ట్ చేశారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకు చెందిన వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని వెంకటేశ్వర్ రెండు సీజన్లకు సంబంధించిన రూ.6.27 కోట్ల విలువైన ధాన్యం తీసుకుని 1,353 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా అందజేయకపోవడంతో సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు.

పెద్దపల్లిలో మరో కేసు..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విజయశ్రీ రైస్ మిల్‌‌ను అధికారులు గురువారం తనిఖీ చేయగా మిల్లులో ఉండాల్సిన ధాన్యం కనిపించలేదు. ఈ మిల్లు నుంచి ప్రభుత్వానికి రూ.4.5 కోట్ల విలువైన సీఎంఆర్ రావాల్సి ఉండడంతో సివిల్ సప్లై అధికారి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు మిల్లు యజమాని కొమురవెల్లి రాజేందర్‌‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.