ఉద్యోగ సంఘాల పేరుతో దాదాగిరీ చల్తానై

ఉద్యోగ సంఘాల పేరుతో దాదాగిరీ చల్తానై
  • సంఘాల నేతలైనా ఆరేండ్లకు కచ్చితంగా బదిలీ కావాల్సిందే
  • రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టమైన మార్గదర్శకాలు
  • ఉద్యోగ సంఘాల్లో ఏ పదవిలో ఉన్నా ట్రాన్స్​ఫర్​ కంపల్సరీ  
  • ప్రభుత్వ గుర్తింపు సంఘాల నేతలకు మాత్రమే ఆరేండ్ల సర్వీస్​ వర్తింపు 


హైదరాబాద్ ,వెలుగు: సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల పేరుతో దాదాగిరీ చేస్తామంటే కుదరదని రాష్ట్ర సర్కార్​స్పష్టం చేసింది. ఎవరైనా సరే విధిగా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని పేర్కొన్నది. గుర్తింపు ఉన్న సంఘాలు, గుర్తింపు లేని సంఘాలు, వాటిలో ఉన్న లీడర్లు సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా తమను మార్చవద్దని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు అన్ని ప్రభుత్వ హెచ్​వోడీలను కోరుతున్నారు.

కానీ, బదిలీల కోసం రాష్ట్ర ఆర్థికశాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలో తెలిపిన మార్గదర్శకాల ప్రకారం.. ఒకచోట ఆరేండ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలుకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని స్పష్టతనిచ్చింది. వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొన్నది.

ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వుల(2012)లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ప్రతీ శాఖలో  వేర్వేరు పేర్లతో  చాలా ఉద్యోగ సంఘాలున్నాయి. వీటిలో చాలా వాటికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు. తెలంగాణ ఏర్పడ్డాక వాటిలోనూ వేటికి అధికారిక గుర్తింపు లభించలేదు. దాంతో తమకు ‘అధికారిక గుర్తింపు’ ఇవ్వాలని గతంలో వివిధ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు.
 
నిబంధనల్లో ఒకటి.. అడిగేది మరొకటి

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘంలో పదవుల్లో ఉన్నవారినే.. అది కూడా ఒకసారి మాత్రమే వరుసగా ఆరేండ్లపాటు ఒకేచోట సర్వీసులో కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వులు 2012లో స్పష్టంగా పేర్కొన్నది. ఆరేండ్లపాటు ఒకచోట పనిచేసిన తర్వాత ఏ సంఘంలో.. ఏ పదవిలో ఉన్నా తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. సిటీ, జిల్లా, తాలుకా కేంద్రంలో ఆరేండ్ల సర్వీసు పూర్తయిన సంఘాల నేతలను మరో ప్రాంతానికి బదిలీ చేసిన తర్వాత, తాము మరోసారి సంఘంలో ఎన్నికయ్యామంటూ.. మళ్లీ తాలుకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర రాజధాని కేంద్రాలకు బదిలీ అడిగే హక్కు ఉద్యోగ సంఘాల నేతలకు లేదని 2012 జీవోలోని 3, 4 నిబంధనలు వివరిస్తున్నాయి.

ప్రభుత్వ గుర్తింపు లేకున్నా కొందరు ఉద్యోగులు తాము ఫలానా సంఘం పదవిలో ఉన్నట్టు చూపుతూ 15-–20 ఏండ్లుగా నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నారు. సీఎం చూస్తున్న ఉపాధి శిక్షణ శాఖ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఆఫీస్​లోనే సూపరింటెండెంట్ ఉద్యోగి ఏకంగా 18 ఏండ్లుగా సంఘం నేత పేరుతో పని చేస్తున్నారు. ఇప్పుడు బదిలీ వద్దని పైరవీలతో ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. తన పోస్టును ఇతరులెవరూ అడగవద్దని శాఖలో అందరినీ హెచ్చరిస్తున్నట్టు సమాచారం. 2012 ఉత్తర్వుల ప్రకారం ఆ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరేండ్లకు మించి ఉండేందుకు వీల్లేదు.   

అధికార గుర్తింపు సంఘాలు తక్కువే

రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి.  ఉమ్మడి ఏపీ లోనే  తెలంగాణ ఉద్యమ టైంలో  తెలంగాణ నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెజిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల సంఘం(టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఓ), తెలంగాణ అగ్రి డాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘం, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం అని కొన్ని సంఘాలు తెలంగాణ అనే పేరుతో  ఏర్పాటై పనిచేశాయి. తెలంగాణ వచ్చాక అంతకుముందు నుంచి ‘తెలంగాణ’ అనే పేరుతో ఉన్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.

మిగిలిన కొన్ని సంఘాల విషయంలో ఇంతవరకూ అధికారికంగా గుర్తింపు ఉత్తర్వులు రాలేదు. దీంతో వైద్య శాఖలోని అనేక సంఘాలు తమకు గుర్తింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేసిన హైకోర్టు..  అన్ని సంఘాలు ఉండటానికి వీల్లేదని, అంతా కలిసి ఒకే సంఘంగా ఏర్పడి నిబంధనల ప్రకారం కార్యవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని, అధికారిక గుర్తింపు కోసం ప్రభుత్వాన్ని కోరాలని సూచించింది. ఈ మేరకు వైద్యులు ఇప్పటి వరకు జిల్లాస్థాయి ఎన్నికలను మాత్రమే పూర్తిచేశారు. రాష్ట్రస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోలేదు. దాంతో గుర్తింపు కూడా రాలేదు.