
కాబూల్: పాకిస్తాన్ బలగాలు తమ దేశంపైకి ఆక్రమణకు వస్తే ఇండియా బార్డర్ దాకా తరిమికొడ్తామని అఫ్గానిస్తాన్ హోంశాఖ డిప్యూటీ మినిస్టర్ మావ్ లావీ ముహమ్మద్ నబీ ఒమారీ ఆదివారం హెచ్చరించారు. అఫ్గాన్ బలగాలు, గిరిజన తెగల యోధులు గనక తలుచుకుంటే పాకిస్తాన్ బలగాలకు ఎక్కడా తలదాచుకునే అవకాశం కూడా ఉండదన్నారు. ‘‘ఒకవేళ మిమ్మల్ని ఆక్రమణదారులుగా అఫ్గాన్ ప్రభుత్వం, గిరిజన తెగల నాయకులు గనక డిక్లేర్ చేస్తే.. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా.
మీకు ఇండియన్ బార్డర్ వరకూ ఎక్కడా సేఫ్టీ అన్నదే ఉండదు” అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వ, మిలిటరీ నాయకత్వం ఇతరుల కోరికలను నెరవేర్చేందుకు అన్ని పనులూ చేసేందుకు సిద్ధమవుతున్నారని.. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తిన వీడియోనే అందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. డ్యూరాండ్ లైన్ (పాక్, అఫ్గాన్ బార్డర్)కు ఆవల గతంలో తాము కోల్పోయిన భూభాగాన్ని స్వాధీనం చేసుకునే అవకాశమూ ఉందన్నారు.