రాహుల్‌‌ పార్ట్‌‌ టైమ్​ పొలిటీషియన్‌‌

రాహుల్‌‌ పార్ట్‌‌ టైమ్​ పొలిటీషియన్‌‌
  • రాహుల్‌‌ పార్ట్‌‌ టైమ్​ పొలిటీషియన్‌‌
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్ ఎద్దేవా
  • వరంగల్‌‌ డిక్లరేషన్‌‌ రాష్ట్రానికా, దేశానికా? 
  • రాష్ట్ర బడ్జెట్​పై అవగాహన ఉండే హామీలిచ్చారా అని ప్రశ్న

హైదరాబాద్‌‌, వెలుగు : రాహుల్‌‌ గాంధీ పార్ట్‌‌ టైమ్​ పొలిటీషియన్‌‌ అని, ఏఐసీసీ అధ్యక్ష పదవి తీసుకోమంటే వద్దని పారిపోయాడని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ ఎద్దేవా చేశారు. వరంగల్‌‌ సభలో కాంగ్రెస్‌‌ ప్రకటించిన డిక్లరేషన్‌‌ ఆచరణ సాధ్యం కానిదన్నారు. శనివారం టీఆర్ఎస్‌‌ ఎల్పీలో ప్రభుత్వ విప్‌‌ ఎంఎస్‌‌ ప్రభాకర్‌‌ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌‌, దానం నాగేందర్‌‌, కాలేరు వెంకటేశ్‌‌, ముఠా గోపాల్‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్‌‌ డిక్లరేషన్‌‌ రాష్ట్రానికా, దేశం మొత్తానికా అనే దానిపై స్పష్టత లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్​పై  అవగాహన ఉండే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు. రాహుల్‌‌కు రైతులపై ప్రేముంటే ఢిల్లీలో  కేసీఆర్‌‌ చేసిన దీక్షకు ఎందుకు మద్దతివ్వలేదన్నారు. కేసీఆర్‌‌ నాయకత్వంలో ప్రజాపోరాటానికి తలొగ్గే తెలంగాణ ఇచ్చారు తప్ప.. అందులో కాంగ్రెస్‌‌ చేసిందేమీ లేదన్నారు.  

కాళేశ్వరం వల్లే చెరువులు అలుగులు పారుతున్నయ్​ 
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయని,  కాంగ్రెస్‌‌ నేతలు వెంట వస్తే చూపించేందుకు సిద్ధమని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. ఢిల్లీ నుంచి పొలిటికల్‌‌ టూరిస్టులు వచ్చి వెళ్తున్నారని, వాళ్లతో ఒరిగేదేమీ లేదన్నారు. రెండుసార్లు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే అధికారంలోకి వచ్చామని, ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా కట్టిస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు. కేసీఆర్‌‌ రాజు కాదని ప్రజల గుండెల్లో ఉన్న మహారాజు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌‌ అన్నారు. దేశంలోనే అద్భుతమైన మేదస్సు ఉన్న సీఎం కేసీఆర్‌‌ అని ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ అన్నారు. నడ్డా, రాహుల్‌‌ గాంధీలకు కేటీఆర్‌‌తో ముఖాముఖి చర్చించే సత్తా, నాలెడ్జ్‌‌ ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.