మాదేమైనా ఏపీలో అపోజిషన్ పార్టీనా?

మాదేమైనా ఏపీలో అపోజిషన్ పార్టీనా?

హైదరాబాద్: ఏపీలో కరెంటు లేదని, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానమంటూ క్రెడాయ్ మీటింగ్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆయనకు పలువురు వైసీపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ వివరించారని.. దీనికి ఏపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని తలసాని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. సిటీలో జరుగుతున్న డెవలప్ మెంట్ గురించే క్రెడాయ్ సమావేశంలో కేటీఆర్ చెప్పారు. మేం ఏమైనా తెలుగుదేశం పార్టీనా? లేదా ఏపీలో అపొజిషన్ పార్టీనా? ఎందుకు అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు’ అని వైసీపీ మంత్రులను తలసాని క్వశ్చన్ చేశారు. 

జెనరేటర్లు పెట్టే పరిస్థితి లేదు
‘మాకంటే అద్భుతంగా పాలన చేస్తే మంచిదే. ఏపీని డెవలప్ చేసుకోండి.  బొత్స సత్యనారాయణ కరెంట్ లేకపోవడంతో జెనరేటర్ వాడామని చెప్పడం మంచి పద్ధతి కాదు. హైదరాబాద్ వచ్చినప్పుడు నాలుగు మీడియా ఛానల్స్ కు వెళ్లి చూసి రండి. అందరి కంటే తాను ఎక్కడ వెనుకపడాతోనని బొత్స మాట్లాడినట్టున్నారు. కరోనా అప్పుడు గాంధీ, ఉస్మానియా, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎవరు ఎక్కువ ట్రీట్మెంట్ చేసుకున్నారో అందరికీ తెలుసు. ఏపీ మంత్రులు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. వాళ్లు ఎందుకు తొందర పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ కరెంట్ లేనప్పుడు ఫంక్షన్ లు ఎందుకు చేస్తున్నారు? ప్రస్తుతం తెలంగాణ లో జెనరేటర్లు పెట్టె పరిస్థితి లేదు’ అని తలసాని స్పష్టం చేశారు. 

బూమరాంగ్ అవుతున్న కేటీఆర్ కామెంట్స్
ఇకపోతే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. తమ ప్రభుత్వం గొప్పలను చెప్పుకునే క్రమంలో ఇతర రాష్ట్రాలపై చిన్నచూపు కామెంట్లు చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. శుక్రవారం క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ లేదని, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ తన ఫ్రెండ్ చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఏపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. ఏపీలో కరెంట్ లేదని ఎవరో చెప్పడం కాదని, తాను హైదరాబాద్ నుంచే వస్తున్నానని.. అక్కడ కరెంట్ లేకపోతే జనరేటర్ వేసుకొని వచ్చానని బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుంచి నాలుగు కాకపోతే 400 బస్సులు పంపుకోవచ్చని, ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఏపీ ప్రజలకు చూపించేందుకు తాము కూడా బస్సులు పెట్టి పంపిస్తామని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ బదులిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం:

మొన్న మంత్రి మల్లారెడ్డి.. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ 

అఫ్గాన్ లో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి