షాద్‌నగర్, వెలుగు : ‘రెండేండ్లలో మేము చేసిన అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీని గెలిపిస్తాయి, రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 శాతం సీట్లు గెలుస్తాం’ అని మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మున్సిపాలిటీల్లో ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందేలా హాస్పిటల్స్‌ను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు.
కంటి పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కేంద్రంతో పాటు 80 డయాలిసిస్ సెంటర్లు, ట్రామా కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలు అందించేలా శివారు ప్రాంతాల్లో 200 పడకలతో హాస్పిటల్స్ నిర్మిస్తామని, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తరహాలోనే 32 డిపార్ట్‌మెంట్లతో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
అంతకుముందు 14వ వార్డు క్యాండిడేట్ అందె మోహన్ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా స్థానిక భవానీ మాత ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
