కళ్లాకురిచి: కల్తీ సారా తాగి 25 మంది దినసరి కూలీలు చనిపోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. తమిళనాడులోని కళ్లాకురిచి పట్టణంలో జూన్ 19న రాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణ పరిధిలోని కరుణాపురంలో కొంతమంది దినసరి కూలీలు సాయంత్రం సారా తాగారు. ఇంటికి వెళ్లాక కొద్దిసేపట్లోనే వారికి తల తిరగడం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి, కళ్లాకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ 10 మంది చనిపోయారు.
30 మందిని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించగా.. 20 మందిని పుదుచ్చేరిలోని జవహర్ లాల్ నెహ్రు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (జిప్ మర్) లో చేర్చారు. ఈ ఘటనపై కళ్లాకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ మాట్లాడారు. మరణాలకు కారణం ఇంకా తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘‘సారాయి తాగిన వారిలో ముగ్గురు వారి ఇంట్లోనే చనిపోయారు. ఒకరు కడుపు నొప్పితో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఫిట్స్ వచ్చి మృతి చెందారు. ఇంకొకరు వయసు పెరగడం వల్ల వచ్చే రోగాలతో చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి రక్త నమూనాలను సేకరించి విల్లుపురంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు జిప్ మర్ కు పంపించాం” అని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ఈ దిశగా ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని ఆయన చెప్పారు. కళ్లాకురిచిలో ఆరుగురు చనిపోగా.. పొరుగున ఉన్న సేలంలో నలుగురు మరణించారని వెల్లడించారు.
ఎస్పీ సస్పెన్షన్, కలెక్టర్ బదిలీ
నాటుసారా తాగి పది మంది చనిపోయిన ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కళ్లాకురిచి ఎస్పీ సమయ్ సింగ్ మీనాను సస్పెండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ ను బదిలీ చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సీబీ సీఐడీ విచారణకు ఆయన
ఆదేశించారు.
