ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేయను, నా వెంట ఉన్న వారిని తప్పు చేయనివ్వను. ఎవరికైనా తప్పుడు ఆలోచనలు ఉంటే, వాటిని వెంటనే తొలగించుకోండి’ అని హెచ్చరించారు. అభిమానులను ఉద్దేశించి తరచుగా ఉపయోగించే ‘ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్’ (నా గుండెల్లో నివసించే వారు) అనే తమిళ పదబంధంతో తన ఉద్వేగభరిత ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘ఒక సహాయ దర్శకుడి కుమారుడు ఇప్పుడు సీఎం అయ్యాడు. నాకు పేదరికం, ఆకలి తెలుసు, నేను రాజకుటుంబం నుంచి రాలేదు. చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నాను. నేను మీ కొడుకులాంటి వాడిని, మీ అన్నలాంటి వాడిని, మీ తమ్ముడిలాంటి వాడిని. మీరు నాకు మీ హృదయంలో చోటు ఇచ్చారు, నన్ను అంగీకరించారు’ అని అన్నారు. ‘డీఎంకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. మేం రూ.10 లక్షల కోట్ల అప్పుతో (మార్చి 2027 నాటి అంచనా) బాధ్యతలు స్వీకరించాం. ప్రజల నిధుల నుంచి మేం పైసా కూడా తీసుకోం. రాష్ట్రాన్ని లూటీ చేయనివ్వం’ అని అన్నారు. విద్యుత్, విద్య, ఆరోగ్యం, నీరు వంటి ప్రాథమిక సమస్యలపై పూర్తి దృష్టి సారిస్తానని చెప్పారు. ‘రైతులు, మత్స్యకారులను సంరక్షిస్తాం’ అని అన్నారు.
తమిళనాడుకు నిజమైన, లౌకిక, సామాజిక న్యాయం కలిగిన కొత్త యుగాన్ని అందిస్తామని విజయ్ వాగ్దానం చేశారు. రాష్ట్రంలో తాను తప్ప మరో అధికార కేంద్రం ఉండదని ప్రకటించారు. కూటమి భాగస్వామి పార్టీల నుంచి వచ్చే ఒత్తిడికి లొంగే ప్రసక్తే ఉండదని భరోసా ఇచ్చారు. తాను దేవదూతను కాదని, అందరిలాగే సామాన్య మనిషినని విజయ్ చెప్పారు. ‘మేం చేయలేని పనులను చేస్తామని వాగ్దానం చేయను. కానీ మీతో కలిసి ఏదైనా సాధించగలననే నమ్మకం నాకుంది. మీరందరూ నాకు కొంత టైమివ్వాలని కోరుతున్నా. వాగ్దానం చేసిన వాటన్నింటినీ క్రమంగా నెరవేరుస్తాను’ అని విజయ్ తెలిపారు.
