ప్రమాణ స్వీకారంలో దళపతి హీరోయిజం.. విజయ్ సొంత స్క్రిప్ట్.. సరిదిద్దిన గవర్నర్ !

ప్రమాణ స్వీకారంలో దళపతి హీరోయిజం.. విజయ్ సొంత స్క్రిప్ట్.. సరిదిద్దిన గవర్నర్ !
  • తమిళనాడులో కొలువుదీరిన విజయ్​ సర్కార్
  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం
  • మంత్రులుగా మరో 9 మంది ప్రమాణ స్వీకారం.. కేబినెట్​లో తన కోర్ టీమ్‌‌‌‌కు చోటు
  • అరవై ఏండ్ల తర్వాత రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం  
  • రాష్ట్రంలో నేను తప్ప మరో ‘పవర్ సెంటర్’ ఉండదు.. తప్పు చేయను, చేయనివ్వను: విజయ్   
  • ఉచిత విద్యుత్, విమెన్ సేఫ్టీ ఫోర్స్ ఫైళ్లపై తొలి సంతకాలు
  • డీఎంకే సర్కారు రూ. 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది
  • ఆ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటన
  • ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ.. స్పెషల్​ అట్రాక్షన్​గా త్రిష

చెన్నై: తమిళనాడులో అరవై ఏండ్ల తర్వాత తొలిసారిగా డీఎంకే, అన్నా డీఎంకేయేతర సర్కారు కొలువుదీరింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ ప్రమాణం చేశారు. ఆదివారం చెన్నైలోని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్​తో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్ కేబినెట్ లో మంత్రులుగా మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు. 

ఇందులో విజయ్ కోర్ టీమ్ సభ్యులుగా పేర్కొనే ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్. నిర్మల్ కుమార్, కె.జి. అరుణ్‌‌‌‌రాజ్, సెంగోట్టాయన్ తోపాటు యువ నేతలు డాక్టర్ టీకే ప్రభు, ఎస్. కీర్తన ఉన్నారు. మొత్తంగా విజయ్ కేబినెట్ యువత, అనుభవజ్ఞుల కలయికగా ఏర్పాటైంది. 

అలాగే, గత డీఎంకే ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా విజయ్, ఆయన కేబినెట్ మంత్రులు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖరన్​, శోభ, ప్రముఖ నటి త్రిషతో పాటు పెద్ద సంఖ్యలో ఆహ్వానితులు హాజరయ్యారు.

కాగా, విజయ్ ప్రభుత్వం ఈ నెల 13లోపు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ నాయకులు శాఖల చర్చలు పూర్తయిన తర్వాత తదుపరి దశలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా, తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, డ్రగ్స్ ముప్పును ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌‌‌‌, మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై విజయ్ తొలి సంతకాలు చేశారు.

పంచలకు బదులుగా షర్టులు, ప్యాంట్లు.. 
విజయ్ తన ట్రేడ్‌‌‌‌మార్క్ తెల్లటి చొక్కా, బేజ్, ఖాకీ ప్యాంటుకు భిన్నంగా ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా తయారయ్యారు. తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, వాటిపై బ్లేజర్ వేసుకున్నారు. తమిళనాడు రాజకీయాల్లో నాయకులు తెల్లటి ధోవతి, తెల్లటి చొక్కా ధరించడం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా విజయ్ పార్టీ నేతలు ఎక్కువగా షర్టులు, ప్యాంట్లతో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణం తర్వాత రాహుల్ గాంధీ, తన కేబినెట్ సహచరులతో సహా స్టేజ్ మీద ఉన్న వారితో విజయ్ సెల్ఫీ దిగి కార్యక్రమాన్ని ముగించారు.

స్టేడియంలో విజిల్ మోతలు
తమిళనాడులో సుమారు 60 ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేయేతర ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేశారు. అదికూడా పార్టీ పెట్టిన అనతికాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. తమ 'దళపతి' (కమాండర్) 'ముతలైమచర్' (సీఎం)గా మారే చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా టీవీకే గుర్తు అయిన విజిల్ తో అభిమానులు, కార్యకర్తలు మోత మోగించారు.

పార్టీ జెండాలు, కండువాలు, ఫ్లెక్సీలతో స్టేడియం ఎరుపు, పసుపుమయం అయిపోయింది. కాగా, ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి విజయం సాధించిన విజయ్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఆయన పెరంబూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 ‘మ్యాజిక్ నంబర్’ సాధించడంలో తనకు మద్దతు ఇచ్చిన డీఎంకే మిత్రపక్షాలన్నింటికీ విజయ్ ధన్యవాదాలు తెలిపారు.

విజయ్ సొంత స్క్రిప్ట్.. సరిదిద్దిన గవర్నర్
ప్రమాణ స్వీకారం సందర్భంగా గవర్నర్ సమక్షంలో అధికారికంగా రూపొందించిన ప్రమాణ పత్రాన్ని మాత్రమే చదవాల్సి ఉండగా.. విజయ్ చేతితో సంజ్ఞలు చేస్తూ, తన సొంత ప్రసంగం చేశారు. ‘‘నేను, సీ జోసెఫ్ విజయ్, చట్టబద్ధంగా ఏర్పాటైన భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను.. తమిళనాడు సీఎంగా, నా బాధ్యతలను నెరవేర్చడానికి నిజాయతీగా, అంకితభావంతో పని చేస్తాను.. నేను చట్టబద్ధమైన పాలనకు కట్టుబడి ఉంటాను, ద్వేషాన్ని తొలగిస్తాను, అన్ని వర్గాల ప్రజల కోసం నిజాయతీగా పనిచేస్తాను. దేవుని సాక్షిగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను’’ అని చెబుతూ, విజయ్ తన కుడిచేతిని పైకి ఎత్తి దేవునిపై ప్రమాణం చేస్తూ పిడికిలి బిగించారు.

దీంతో విజయ్ వెనుక నిలబడి ఉన్న టీవీకే ఎమ్మెల్యే ఎ. రాజ్ మోహన్ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. వేదిక ముందు ఉన్న విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జోక్యం చేసుకుని, తనకు అందించిన పత్రం చూసి అధికారిక ప్రమాణాన్ని మాత్రమే చదవాలని సూచించారు. దీనిపై గవర్నర్ నుంచి క్లారిఫై చేసుకున్నాక, విజయ్ అధికారిక ప్రమాణ పత్రాన్ని చదువుతూ, దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా త్రిష
అట్టహాసంగా జరిగిన విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందు వరుస లో కూర్చున్న విజయ్ పేరెంట్స్ వద్దకు వెళ్లి త్రిష వారిని పలకరించారు. వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ఆకట్టుకుంది. విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె ఎంతో చొరవగా గడపడం, వారితో కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం విశేషం.