తమిళనాడు సంచలన జ్యోతిష్యుడు రాధా పండిట్ ను తన OSD పదవి నుంచి తప్పించారు సీఎం విజయ్. నియామకం అయిన 24 గంటల్లోనే అతన్ని తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. 24 గంటలు కాక ముందే ఈ నిర్ణయం రావటంతో.. జ్యోతిష్యుడు రాధా పండిట్ జాతకమే రివర్స్ అయ్యింది.. తన జాతకమే ఇలా ఉంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు తమిళనాడు సోషల్ మీడియా.
అతను చాలా పెద్ద జ్యోతిష్యుడు.. పేరు రాధా పండిట్. విజయ్ సీఎం అవుతాడని.. టీవీకే పార్టీదే విజయం అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ సీఎం కావటం జరిగిపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. సీఎం అయిన మూడో రోజునే.. విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జ్యోతిష్యుడు రాధా పండిట్ ను తన OSD.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ జీవో జారీ చేశారు. ఓ జ్యోతిష్యుడిని ఓఎస్డీగా పెట్టుకోవటంపై తమిళనాట వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. పాలనలో అనుభవం లేని వ్యక్తిని.. ప్రభుత్వ విధివిధానాలు తెలియని వ్యక్తిని.. అందులోనూ ఓ జ్యోతిష్యుడిని OSDగా పెట్టటంపై వ్యతిరేకత వచ్చింది.
మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు:
తమిళనాడులో అతిపెద్ద పార్టీగా గెలిచిన టీవీకే.. ఇతర పార్టీల మద్ధతుతో గవర్నర్ ముందు బలం నిరూపించుకున్న తర్వాత.. ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధా పండిట్ ను నియమించింది విజయ్ ప్రభుత్వం. సీఎం విజయ్ ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై ముందునుంచీ దుమారం రేగుతోంది. రాధన్ పండిట్ నియామకాన్ని విపక్షాలతో పాటు మిత్ర పక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. .
2026 మే 13న విశ్వాస పరీక్ష సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధులు ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో గవర్నర్ పాలన రాకూడదనే టీవీకే కి మద్దతు ఇచ్చామని అన్నారు వీసీకే ఎమ్మెల్యే అరసు. జ్యోతిష్యుడిని నమ్ముకొని పాలన చేయొద్దని సూచించింది వీసీకే పార్టీ. శాస్త్రీయమై విధానంతో ముందుకు వెళ్లాలని.. జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయరాదని అన్నారు. బీజేపీ డర్టీ పాలిటిక్స్ ను అడ్డుకునేందుకే టీవీకేకు మద్దతు తెలిపామని అంటోంది ఐయుఎంఎల్ పార్టీ.
డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే.. సీఎంగా విజయ్ చేసిన మంచిని సమర్థిస్తూనే కౌంటర్ ఇచ్చారు ప్రేమలత. విజయ్ ఓఎస్డీగా రాధన్ నియామకాన్ని తప్పుబట్టారు ప్రేమలత. మీకు ఓటేసింది యువత అని, జ్యోతిష్యులు కాదని అన్నారు. దీనివలన యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. నమ్మకం ఉంటే జ్యోతిష్యులను ఇంట్లో ఉంచుకోవాలని.. కీలక పదవుల్లో ఇలాంటివారిని తీసుకురావడం సరికాదని అన్నారు ప్రేమలత.
