చెన్నై: తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టేందుకు టీవీకే చీఫ్ విజయ్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఓసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించిన గవర్నర్.. రెండోసారి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (118 సీట్లు) ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తామని విజయ్‌కు రెండోసారి తేల్చిచెప్పారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని.. అందుకు అవసరమైన సంఖ్యాబలం రుజువయ్యే వరకు వేచి చూస్తానని పేర్కొన్నారు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
గవర్నర్ చెప్పింది ఇదేనా.. ? : సంధించిన ప్రశ్నలు ఇవేనా?
>>> 112 మంది ఎమ్మెల్యేలతో ఎలా ప్రమాణం చేస్తారు..
>>> టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలు ఏంటీ..?
>>> సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజార్టీని ఎలా నిరూపించుకుంటారని భావిస్తున్నారు..?
>>> మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో మీరు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా..?
>>> సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోండి
>>> 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపిస్తేనే ప్రమాణ స్వీకారం చేయగలరు.
>>> సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మద్దతు వస్తుందనే ఊహతో మీరు ఎలా ఉన్నారు..?
>>> ఇప్పుడు మద్దతు ఇవ్వని వారు.. అప్పుడు మద్దతు ఇస్తారని మీరు ఎలా భావిస్తున్నారు..?
గవర్నర్ సంధించిన ప్రశ్నలకు విజయ్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవటంతో.. గవర్నర్ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు రాజకీయ వర్గాల సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీ (108 సీట్లు)గా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గురువారం (మే 7) రెండోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని.. ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ విజయ్ అభ్యర్థనను రెండోసారి కూడా గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని కుండబద్దలు కొట్టారు గవర్నర్. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మరోసారి బ్రేక్ పడింది. గవర్నర్ నిర్ణయంపై విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలీ.
