పెళ్లికి వచ్చి.. స్టాంప్ పేపర్ లపై సంతకాలు చేయించుకున్నారు

పెళ్లికి వచ్చి.. స్టాంప్ పేపర్ లపై సంతకాలు చేయించుకున్నారు

పెళ్లికొడుకు స్నేహితుల వింత కోరిక విని.. పెళ్లి కూతురుతో పాటు కుటుంబసభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాళ్ల కోరికను మన్నించిన పెళ్లి కూతురు స్టాంప్ పేపర్స్ పై సంతకం చేసింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తేనిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ప్రొఫెసర్ గా హరి ప్రసాద్ పని చేస్తున్నారు. ఇతని వివాహం పూజతో ఆదివారం జరిగింది. పెళ్లికి ఇరువురు కుటుంబసభ్యులు, స్నేహితులు వచ్చారు. గ్రాండ్ గా జరిగిన ఈ వివాహానికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి బహుమతులను అందచేశారు. కానీ.. వరుడు స్నేహితులు మాత్రం రూ. 20 స్టాంప్ పేపర్స్ తో నూతన వధూవరుల వద్దకు వచ్చారు. ఒప్పందంపై సంతకం చేయాలని పెళ్లి కూతురును కోరారు. అసలు స్టాంప్ పేపర్ లో ఏముందో తెలియని ఆమె.. ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలుసుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ సంతకం చేసింది. 

స్టాంప్ పేపర్ లో ఏముంది ? 
సూపర్ స్టార్ జట్టుకు హరిప్రసాద్ తో పాటు అతని స్నేహితులు క్రికెట్ ఆడుతుంటారు. జట్టుకు హరిప్రసాద్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రతి శని, ఆదివారాల్లో వీరు ప్రాక్టిస్ చేస్తుంటారు. కానీ.. హరి ప్రసాద్ కు వివాహం అవుతుండడంతో అతను క్రికెట్ ఆడకపోవచ్చని స్నేహితులు భావించారు. దీంతో అతనితో క్రికెట్ ఆడించేందుకు పెళ్లి కూతురును ఒప్పించాలని నిర్ణయించారు. ఒప్పుకోదని అనుకుని..రూ. 20 స్టాంప్ పేపర్లను తీసుకెళ్లారు. వీటిని పెళ్లి కూతురికి అందించి...సంతకం చేయాలని కోరారు. పేపర్లలో ఉన్న విషయాన్ని చదివి సంతోషంగా ఒప్పుకుంది. ‘నా భర్తను క్రికెట్ ఆడించేందుకు అనుమతిస్తాను’ అంటూ రాసి సంతకం చేసింది. దీంతో హరిప్రసాద్ స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్టాంప్ పేపర్లతో నూతన వధూవరులు ఫొటోలు దిగారు.