తమిళ రాజకీయాలను షేక్‌‌ చేస్తున్న శశికళ రీ ఎంట్రీ!

తమిళ రాజకీయాలను షేక్‌‌ చేస్తున్న శశికళ రీ ఎంట్రీ!

చెన్నై: తమిళనాట రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గత ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మౌనంగానే ఉన్న మాజీ సీఎం జయలలిత సహచరి శశికళ మెల్లిగా యాక్టివ్ అవుతున్నారు. అన్నాడీఎంకే పగ్గాలు చేజిక్కించుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. శనివారం చెన్నై టీ నగర్ లోని ఎంజీఆర్ మెమోరియల్​లోని జయ సమాధి వద్దకు భారీ ఊరేగింపుతో వెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కలకలం సృష్టించడం తెలిసిందే. అక్కడ ఆవిష్కరించిన శిలాఫలకంపై ‘శశికళ, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ’ అని రాయించుకోవడం ద్వారా తన రాజకీయ ఆకాంక్షలను స్పష్టంచేశారు. జయ హయాం దాకా అన్నాడీఎంకేలో జనరల్ సెక్రటరీయే అత్యున్నత పదవిగా ఉండేది. తర్వాత తాత్కాలికంగా ఆ పోస్టు చిన్నమ్మ శశికళకు దక్కినా, వారసత్వ పోరులో మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు ఆ పదవినే రద్దు చేశారు. దాని స్థానే కో ఆర్డినేటర్, కో కోఆర్డినేటర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పార్టీ నియమావళిని మార్చారు. దీన్ని సవాలు చేస్తూ శశికళ సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. తర్వాత నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు. కాగా, ఎంజీఆర్​, జయలలిత సమాధి వద్ద పార్టీ జెండా ఎగరవేసేందుకు,  జనరల్ సెక్రటరీగా చెప్పుకోవడానికి శశికళకు హక్కులేదని అన్నాడీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.