
తమిళ స్టార్ నటుడు ధనుష్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు, సార్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇటీవలే రాయన్ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తమిళ నిర్మాతల మండలి ధనుష్‌కు రెడ్ కార్డు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే అతడితో ఏ దర్శకుడు, నిర్మాతలు చిత్రాలు తీయకూడదు. అతడి సినిమాలపై బ్యాన్ విధిస్తారు.
కమిట్‌మెంట్‌కు మారుపేరైన ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చాడట. ఇందుకోసం అడ్వాన్స్ తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాలా కాలమే అవుతోండగా.. ఇప్పటివరకు సినిమా మాత్రం చేయలేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. దీనిపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోలివుడ్ లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది.
ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో నిర్మాతల మండలి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాగే అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే ఫిర్యాదులు ఇటీవల తమిళ ఇండస్ట్రీలో అధికం అవుతున్నాయి. దాదాపు 14 మంది నటీనటులు నిర్మాతలకు ఇచ్చిన కమిట్‌మెంట్లను నెరవేర్చనందుకు వీరందరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిందరిపై రెడ్ కార్డు జారీ చేస్తే వీళ్లతో ఎవరూ సినిమాలు చేయకూడదు. కాగా గతంతో దర్శకుడు శంకర్‌తో ఇలాంటి ఓ వివాదం కారణంగా కమెడియన్ వడివేలుపై నిషేదం విధించగా కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ధనుష్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు.