
రావు రమేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. మారుతి నగర్ వాసి సుబ్రమణ్యంకి ఎటకారం ఎక్కువ. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి 'పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని అడిగితే... 'గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను' అని చెబుతాడు.
టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా, ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. ‘నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే... దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు’ అని రావు రమేష్ అత్త పాత్ర పోషించిన అన్నపూర్ణమ్మ డైలాగ్ చెప్పడం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 23న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా సినిమా విడుదల కానుంది.