కేసీఆర్ ఓటమి ఖాయం: తరుణ్ చుగ్

కేసీఆర్ ఓటమి ఖాయం: తరుణ్ చుగ్
  • అభ్యర్థుల లిస్ట్ చూస్తేనే అర్థమైంది
  • అవినీతిపరులైన సిట్టింగ్​లకే టికెట్లు ఇచ్చారు
  • డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే అభివృద్ధి
  • కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో కేసీఆర్​కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ స్టేట్ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తేనే అర్థం అవుతున్నదని మంగళవారం ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్​ను రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా బంగాళా ఖాతంలో కలిపేందుకు రెడీ అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో చాలా వ్యతిరేక ఉందని తెలిపారు. ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించేందుకు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని వివరించారు. అవినీతి ఎమ్మెల్యేల పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ గతంలో కేసీఆర్ ప్రకటించారని, దీంతో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని ప్రజలు భావించారని పేర్కొన్నారు. తీరా చూస్తే 7 చోట్ల మినహా సిట్టింగ్​లందరికే టికెట్లు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ పార్టీ విధానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వివరించారు. దళిత బంధులో కమీషన్ తీసుకుంటున్నారని తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపైనే కేసీఆర్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. వారికి కూడా మళ్లీ టికెట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల అవినీతి కేసీఆర్ సమర్థిస్తున్నారనడానికి ఇదే నిదర్శమని పేర్కొన్నారు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు అని ఆరోపించారు. అవినీతి కేటగిరిలో కేసీఆరే ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు అని ఎద్దేవా చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారని, తీరా లిస్ట్ చూస్తే.. 115 మంది అభ్యర్థుల్లో ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారని విమర్శించారు. సొంత పార్టీలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. మునుగోడులో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు వారిని వదిలేశారని, ఇదే కేసీఆర్ నైజం అని ఫైర్ అయ్యారు.