డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడిపై ఫోకస్

డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడిపై ఫోకస్
  • ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ తరుణ్ జోషి
  • నూతన కమిషనర్​గా బాధ్యతల స్వీకరణ

ఇబ్రహీంపట్నం, వెలుగు: డ్రగ్స్​ కంట్రోల్​, సైబర్​ నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. గత కమిషనర్ జి.సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 2004 ఐపీఎస్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన తరుణ్ జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సిటీ పోలీసు కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన కమిషనరేట్ ఏర్పాటుతో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. 

ఓయూలో మాస్టర్స్​, ఎల్​ఎల్​బీ..

పంజాబ్ రాష్ట్రానికి చెందిన తరుణ్ జోషి పటియాలాలోని ప్రభుత్వ డెంటల్ కళాశాల హాస్పిటల్​లో బీడీఎస్ పూర్తి చేశారు. 2004లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉమ్మడి ఏపీ కేడర్‌‌‌‌‌‌‌‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. 2014 నుంచి 2016 వరకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా సేవలందించారు. ఆ తర్వాత ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా, రాచకొండ సీపీగా కొంతకాలం పనిచేశారు. విధులు నిర్వహిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించిన ఆయన ఓయూ నుంచి పోలీసు నిర్వహణలో మాస్టర్స్ పట్టా పొందారు. 

అనంతరం ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీ పూర్తి చేసి అదే యూనివర్సిటీలో టాప్​ ర్యాంకు సాధించారు. పర్వతారోహణ ఆయనకు ప్రత్యేక అభిరుచి. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌లో శిక్షణ తీసుకుని, అదే ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మౌంట్ రీనాక్ పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పటివరకు మొత్తం ఆరు ప్రముఖ పర్వతాలను అధిరోహించారు.