హుక్కా సెంటర్​పై టాస్క్​ఫోర్స్ దాడులు..16 మంది అరెస్ట్

 హుక్కా సెంటర్​పై టాస్క్​ఫోర్స్ దాడులు..16 మంది అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: హుక్కా సెంటర్​పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మొఘల్ పురాకు చెందిన మహ్మద్ సుల్తానా(29) హబీబ్ నగర్ లో హుక్కా సెంటర్ ను నడుపుతున్నాడు. చార్మినార్ కు చెందిన షేక్ ఏజాజ్(21), ఫలక్ నుమాకు చెందిన షేక్ సాజిద్(21)తో పాటు మరొకరు అక్కడ వర్కర్లుగా పనిచేస్తున్నారు.

ఈ  హుక్కా సెంటర్ కు మైనర్లను అనుమతించడంతో పాటు నికోటిన్ ను కలుపుతున్నట్లు తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకుని దాడులు చేశారు. ముగ్గురు వర్కర్లతో పాటు 13 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. 30 హుక్కా పాట్స్, 25 పైప్ లు, రూ.8 వేల 880 క్యాష్ ను స్వాధీనం చేసుకుని హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించామన్నారు.