- జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు
- ఖరీఫ్ కు ముందే పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు
- నకిలీలతో ప్రతిఏటా నష్టపోతున్న రైతులు
ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే పత్తి ఎక్కువగా సాగు చేసే ఆదిలాబాద్ జిల్లా నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపుతున్నాయి. ఖరీఫ్ కు ముందే నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం కలెక్టర్‌దృష్టికి చేరడంతో జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, నకిలీ విత్తనాలను అరికట్టాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. విత్తన, ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని.. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వానకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. మండల వ్యవసాయ అధికారి, ఎస్సై, తహసీల్దార్లతో మండలాల వారీగా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో డీలర్ దుకాణాలను నిశితంగా పరిశీలించి, స్టాక్ రిజిస్టర్లను నిల్వలతో సరిపోల్చనున్నారు.
ఎవరైనా అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్, కొబ్బాయి, ఘన్పూర్, లక్ష్మీపూర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు మొదలు పెట్టారు. మరోపక్క మండల స్థాయిలో ఫెర్టిలైజర్ షాప్ డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నారు.
గ్రామాల్లోకి నకిలీ విత్తనాలు
గ్రామాల్లో రైతులు వానాకాలం పంట సాగు కోసం పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కులు దున్ని, చెత్త తొలగించే పనులు సాగుతున్నాయి. మరోపక్క పంట సాగుకు రెండు నెలల ముందే గ్రామాల్లోకి నకిలీ విత్తనాలు సరఫరా చేసేందుకు వ్యాపారులు యత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం బేల మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమాయక రైతులకు అంటగట్టేందుకు మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తరలిస్తున్నారు. ఆయా కంపెనీల బ్రాండ్ విత్తనాల ప్యాకెట్ల రూపంలోనే నకిలీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. లూజ్ విత్తనాలనూ రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో ప్రతిసారీ నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. కానీ వాటి నిరోధానికి శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు.
డీలర్ల, గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనాలి
నకిలీ విత్తనాలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. విత్తనాల అమ్మకాలకు సంబంధించి వ్యాపారులు రశీదులతో పాటు లాట్ నెంబర్ తప్పకుండా రాయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలంటున్నారు. కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, ఎక్స్పైరీ డేట్, తయారీ డేట్ ను సరిచూసుకోవాలని.. వ్యాపారి వద్ద నుంచి బిల్లును తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
కఠిన చర్యలు తప్పవు
లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ బృందాలతో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. డీలర్లకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. విత్తనాల ప్యాకెట్లపై కంపెనీ పేరు, తయారీ తేదీ, గడువు, ఎమ్మార్పీ వంటి వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. – శ్రీధర్ స్వామి, అగ్రికల్చర్ ఆఫీసర్, ఆదిలాబాద్

