బోయింగ్‌‌తో టాటా అడ్వాన్స్‌‌డ్ సిస్టమ్స్ జోడీ

బోయింగ్‌‌తో టాటా అడ్వాన్స్‌‌డ్ సిస్టమ్స్ జోడీ
  • అడ్వాన్స్‌‌డ్ కాంపోజిట్ అసెంబ్లీల తయారీకి ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: - టాటా అడ్వాన్స్‌‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్​ఎల్​) బోయింగ్ 737 మ్యాక్స్​, 777 ఎక్స్​,  787 డ్రీమ్‌‌లైనర్ విమానాల కోసం అధునాతన కాంపోజిట్ అసెంబ్లీలను తయారు చేయడానికి,  సరఫరా చేయడానికి బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌‌ప్లేన్స్ (బీసీఏ)తో ఒప్పందం కుదుర్చుకుంది. టీఏఎస్​ఎల్​ ఈ భాగాలను బెంగళూరు,  నాగ్‌‌పూర్‌‌లో ఉన్న దాని అత్యాధునిక   తయారీ యూనిట్లలో తయారు చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ ఏరోస్పేస్ మార్కెట్‌‌లలో కాంపోజిట్ టెక్నాలజీ సరఫరాదారుగా తన స్థానం మరింత బలోపేతమవుతుందని టీఏఎస్​ఎల్​ తెలిపింది.  టీఏఎస్​ఎల్​ నాగ్‌‌పూర్, బెంగళూరు,  హైదరాబాద్‌‌ ప్లాంట్ల నుంచి బోయింగ్ విమానాల కోసం అనేక క్లిష్టమైన సిస్టమ్‌‌లను,  విడిభాగాలను కూడా తయారు చేస్తుంది.  తెలంగాణలో టీఏఎస్​ఎల్​-బోయింగ్ జాయింట్ వెంచర్ అపాచీ హెలికాప్టర్‌‌ల కోసం ఫ్యూజ్‌‌లేజ్‌‌లను,  737 విమానాల కోసం కాంపొనెంట్లను తయారు చేస్తుంది.

భారత ఏవియేషన్​ మార్కెట్​బేష్​: బోయింగ్​

రాబోయే 20 ఏళ్లలో ఎనిమిది శాతం కంటే ఎక్కువ వార్షిక ట్రాఫిక్ వృద్ధితో దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌‌గా అవతరిస్తుందని బోయింగ్​ అంచనా వేసింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మద్దతుతో భారతదేశ మధ్యతరగతి విమాన ప్రయాణాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపింది. పెరుగుతున్న ప్రయాణీకుల,  కార్గో డిమాండ్‌‌ను తీర్చడానికి, దక్షిణాసియా క్యారియర్‌‌లు రాబోయే రెండు దశాబ్దాల్లో తమ విమానాల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుతాయని బోయింగ్  కమర్షియల్ మార్కెట్ ఔట్‌‌లుక్  అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం రాబోయే 20-సంవత్సరాల డిమాండ్​ను తట్టుకోవడానికి కంపెనీలకు 2,700 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరం. ఇండియాలో ఎయిర్ ​ట్రాఫిక్  సామర్థ్యం ఇప్పుడు కరోనా పూర్వ స్థాయిలను మించిపోయిందని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హల్స్ట్ అన్నారు.  

3 గ్లోబల్ ఏవియేషన్ కంపెనీలతో జెట్‌‌ సెట్‌‌ గో ఒప్పందం

 ఎయిర్ సర్వీసెస్ ఆపరేటర్ జెట్​సెట్​గో మూడు గ్లోబల్ ఏవియేషన్ టెక్ సంస్థలతో  1.3- బిలియన్ డాలర్లపైగా విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో 280 హైబ్రిడ్- ఎలక్ట్రిక్ ఎయిర్‌‌క్రాఫ్ట్ డీల్‌‌ కూడా ఉంది.  విమానాశ్రయ బదిలీలు, ప్రాంతీయ కనెక్టివిటీ, ఇంటర్-సిటీ కమ్యూట్, ఇంట్రా-సిటీ షటిల్  అర్బన్ ఎయిర్ ట్యాక్సీల కోసం ఈ విమానాలను వినియోగిస్తామని జెట్‌‌సెట్‌‌గో తెలిపింది. హైదరాబాద్‌‌లో జరుగుతున్న మెగా ఏవియేషన్ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024లో ఎలెక్ట్రా డాట్​ ఏరో,  హారిజన్ ఎయిర్‌‌క్రాఫ్ట్,  ఓవర్‌‌ఎయిర్‌‌తో ఈ ఒప్పందాలు జరిగాయి. తాము  780 మిలియన్ డాలర్ల విలువైన150 విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జెట్​సెట్​ గో ప్రకటించింది. అడ్వాన్స్‌‌డ్ ఎయిర్ మొబిలిటీ, ఎలక్ట్రిక్  హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి కొత్త ఏవియేషన్ టెక్నాలజీలను ఉపయోగించుకుని, నగరాల మధ్య  లోపల తక్కువ దూరం ప్రయాణించడానికి ఎయిర్ టాక్సీ తరహా సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.