బిగ్‌బాస్కెట్.. టాటా గ్రూప్ సొంతం

బిగ్‌బాస్కెట్.. టాటా గ్రూప్ సొంతం

ఆన్‌లైన్‌లో నిత్యావసర సరుకులను అమ్మే బిగ్‌బాస్కెట్  సంస్థలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో ఈ-కామర్స్‌లో పెద్ద సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి సంస్థలతో టాటా సంస్థ పోటీకి దిగింది. టాటా సన్స్ తమ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ ద్వారా బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారనంగా లాక్‌డౌన్లు పదేపదే వస్తుండడంతో ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంటోంది.  ఈ క్రమంలో టాటా ఈ రంగంలోకి ఎంటర్ కావడం చెప్పుకోదగింది.

అలీబాబా ప్రమోట్ చేసిన బిగ్‌బాస్కెట్ సూపర్ మార్కెట్ గ్రాసరీ సప్లయిస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ కంపెనీలో 63.4 శాతం వాటా కొనుగోలుకు టాటా చేసిన ప్రతిపాదనను కాపింటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత ఏప్రిల్ నెలలో ఆమోదించింది. 2011లో బెంగళూరులో ప్రారంభించిన బిగ్ బాస్కెట్ ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులో ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం క్యూమిన్, లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం టాటా క్లిక్, ఎలెక్ట్రానిక్స్ స్టోర్ క్రోమా వంటి వివిధ రకాల కంజూమర్ బిజినెస్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సూపర్ యాప్ తయారు చేస్తున్నట్టు టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. బిగ్ బాస్కెట్ ను కూడా అందులో చేర్చే అవకాశాలున్నాయి.