V6 News

 వాహనదారుల కష్టాలు : పెట్రోల్, డీజిల్ కోసం తిప్పలు

 వాహనదారుల కష్టాలు : పెట్రోల్, డీజిల్ కోసం తిప్పలు
  • ఏపీలో కొరత కారణంగా సరిహద్దు జిల్లాలపై ఎఫెక్ట్​..
  • పలు జిల్లాల్లో బంకుల ముందు భారీ క్యూలు
  • హైదరాబాద్​లో కిలోమీటర్ల కొద్దీ లైన్లు
  • సోషల్​ మీడియా పుకార్లతో వినియోగదారుల్లో ఆందోళన
  • జనం ఎగబడటంతో చాలా బంకులు ఖాళీ

హైదరాబాద్‌‌‌‌/నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్​ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏపీలోని కొన్ని పెట్రోల్ బంకులు శని, ఆదివారాల్లో మూతపడడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లోని పెట్రోల్​బంకులపై  ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జనం ఎగబడడంతో చాలా బంకులు ఖాళీ అయ్యాయి.

హైవేల వెంట ఉన్న పెట్రోల్​బంకుల్లో లారీల దెబ్బకు డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. అటు డీలర్ల నుంచి డిపాజిట్​అందిన మూడు, నాలుగు రోజులకు కూడా కంపెనీల నుంచి ట్యాంకర్లు రావడం లేదు. దీనికితోడు  శని, ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో చాలామంది డీలర్లు డీడీలు తీయలేకపోయారు. ఆయిల్ కంపెనీలు ఉద్దెర ఇవ్వకపోవడంతో బంకులకు ఏకంగా రెండు రోజుల పాటు ఇంధనం అందలేదు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారంతో కొన్ని బంకులు కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.150 వరకు పెంచగా.. వారు రిటైల్ ఔట్‌‌‌‌లెట్ల వైపు మళ్లుతున్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల్లో శని, ఆదివారాల్లో కొన్నిబంకుల ముందు వాహనాలు బారులుతీరాగానే, దీనిపై సోషల్ మీడియాలో వదంతులు తీవ్రమయ్యాయి. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, డ్రమ్ములు, క్యాన్లు నింపుకొని పోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చాలా బంకులు ఖాళీ అయ్యాయి.

ఘట్‌‌‌‌కేసర్, చర్లపల్లి ఆయిల్ డిపోలలో రోజుకు ఒక్కో డిపోలో సుమారు 400 ట్యాంకర్లను నింపగల సామర్థ్యం ఉంది. కానీ, ఆర్టీసీకి సరఫరాకు వెళ్లిన ట్యాంకర్లు అన్‌‌‌‌లోడ్ చేయకపోవడం.. ఆయిల్ డిపోలకు ట్యాంకర్ల రాక తగ్గిపోవడం వల్ల కూడా సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఎక్కడ చూసినా నో స్టాక్​ బోర్డులే

ఖమ్మం జిల్లాలోని బంకుల్లో సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగింది. చాలాచోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టగా,  స్టాక్ ఉన్న బంకుల్లో క్యూ లైన్లు, వాహనాలు బారులుతీరాయి. దీంతో వేసవి టూర్లు ప్లాన్ చేసుకున్నవారు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి.

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని పెట్రోల్ బంకువద్ద ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగగా.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పెట్రోల్ పోశారు. సూపర్ బజార్ సెంటర్లో పెట్రోల్ బంక్ వద్ద క్యాన్లు, బాటిల్లతో భారీ ఎత్తున ప్రజలు గుమిగూడగా.. బంక్​ యజమానులు పెట్రోల్ పోయడం ఆపేశారు. జిల్లాలో పెట్రోలుకు కొరత లేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు.

క్రెడిట్ పాలసీ రద్దు కారణంగా వరంగల్ ట్రై సిటీలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. హనుమకొండలో పోలీస్ డిపార్ట్​మెంట్ నిర్వహించే కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్, సెంట్రల్ జైల్ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్, రాంనగర్ ఆర్టీసీ బంకుల్లో ఎక్కువ రద్దీ కనిపించింది. చాలా బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్‌‌‌‌, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కురవి, గూడూరు, దంతాలపల్లిలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. గతంలో చమురు డెలివరీ అయిన తరువాత డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉండేది. యుద్ధం కారణంగా ముందు డబ్బులు కట్టాల్సిందేనని ఆయిల్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు కట్టిన 2-,3 రోజుల వరకు ఆయిల్ ట్యాంకర్లు రావడం లేదు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపించాయి.

మెదక్ టౌన్, రూరల్ మండలం, కొల్చారం, పాపన్నపేట, కౌడిపల్లి తదితర మండలాల్లో చాలా వరకు పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మెదక్ టౌన్​లో 11 పెట్రోల్ బంక్ లుండగా.. ఒక్క బంకులో మాత్రమే స్టాక్​ ఉండటంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. కొద్ది సేపట్లోనే డీజిల్ అయిపోయింది. దీంతో ఆటో డ్రైవర్లు గొడవకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

వరి కోతలు నడుస్తుండగా డీజిల్ కొరత వల్ల హార్వెస్టర్, ట్రాక్టర్ యజమానులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో హైవేల మీద ఉన్న బంకులన్నీ మూతపడ్డాయి, దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆయిల్​ కంపెనీలు ఉద్దెర ఇవ్వకపోవడంవల్లనే కొరత ఏర్పడిందని బంకుల నిర్వాహకులు చెప్తున్నారు. 

హైదరాబాద్​ సిటీలో పలుచోట్ల బంకుల ముందు బారులు

మరోసారి పెట్రోల్​ కొరత వస్తుందన్న ప్రచారంతో హైదరాబాద్​ సిటీలో ఆదివారం సాయంత్రం నుంచే వాహనదారుల పెట్రోల్​ బంకులకు క్యూలు కట్టారు. సోమవారానికి ఈ పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది.చాలా బంకుల్లో పెట్రోల్​స్టాక్​ లేదంటూ బోర్డులు దర్శనం ఇచ్చాయి. ఉన్న బంకుల్లో చాలా మంది అవసరానికి మించి పెట్రోల్ కొన్నారు.

బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, సికింద్రాబాద్​, దిల్​సుఖ్​​నగర్​, అంబర్​పేట, కూకట్​పల్లి, మాదాపూర్​, నాంపల్లి, లక్డీకాపూల్​ వంటి ప్రాంతాల్లోని పెట్రోల్​ బంకుల ఎదుట వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఫోర్ వీలర్స్​, టూ వీలర్లు, ఆటోల క్యూలు పెరిగిపోవడంతో చాలాచోట్ల ట్రాఫిక్​జామ్స్ ఏర్పడింది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలో లైన్లు కట్టగా, సాయంత్రం అక్కడక్కడా వర్షం పడడంతో వానలో తడుస్తూ క్యూలో ఉండాల్సి వచ్చింది.