- తండ్రి మృతి.. తల్లికి తీవ్ర గాయాలు
జీడిమెట్ల, వెలుగు: కుమార్తెను చూడడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి మృతువుతో పోరాడుతోంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూర్కు చెందిన కంటంగూరి వెంకటరామిరెడ్డి (56), లత (52) దంపతులు. పది రోజుల కింద వీరు చింతల్సాయినగర్లోని తమ కుమార్తె దీపిక ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం తిరిగి ఊరు వెళ్దామని సికింద్రాబాద్లో బస్సు ఎక్కడానికి బయలుదేరారు.
గణేశ్ నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా, వీరిని బాలానగర్ నుంచి జీడిమెట్ల వైపు వేగంగా వెళ్తున్న టాటా మినీ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరామిరెడ్డి స్పాట్లోనే మృతి చెందగా, లతకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె సమీప హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
