టీబీజీకేఎస్​ గెలుపు సింగరేణికి అవసరం : ఎమ్మెల్సీ కవిత

టీబీజీకేఎస్​ గెలుపు సింగరేణికి అవసరం : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు :  కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ను గెలిపించడం సింగరేణికి అవసరమని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాలు కాపాడేందుకు యాజమాన్యంతో పోరాడేది టీబీజీకేఎస్​మాత్రమేనని తెలిపారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై గురువారం హైదరాబాద్​లోని తన నివాసంలో సంఘం ముఖ్య నాయకులతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రధాన భూమిక పోషించారని చెప్పారు.

జాతీయ కార్మిక సంఘాలకు పోరాట స్ఫూర్తి లేదని విమర్శించారు. టీబీజీకేఎస్ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో నాయకుడు ఒక్కో కేసీఆర్ లా పని చేసి సంఘాన్ని గెలిపించాలని సూచించారు.  ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల కోసం ఎప్పుడు పోరాడలేదని పేర్కొన్నారు. భవిష్యత్ లోను అవి పోరాడవని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నా ఒక్క రోజు కూడా సమ్మె చేయకుండా అన్ని హక్కులు సాధించుకున్నామని స్పష్టం చేశారు.