రూపాయి పతనంతో వీటికి లాభమే

రూపాయి పతనంతో వీటికి లాభమే
  • ఏడాది కనిష్టాలకు చేరువలో ట్రేడవుతున్న టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌
  • లాంగ్ టెర్మ్‌‌‌‌ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం అంటున్న ఎనలిస్టులు
  • రూపాయి పతనంతో వీటికి లాభమే

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, విప్రో, హెచ్‌‌సీఎల్‌‌ టెక్ వంటి టాప్ ఐటీ కంపెనీల షేర్లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. గ్లోబల్‌‌గా వడ్డీ రేట్లు పెరగడం మొదలయినప్పటి నుంచి ఈ కంపెనీల షేర్లు పడుతున్నాయి. యూఎస్‌‌తో సహా వివిధ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటుండడంతో ఐటీ కంపెనీలపై నెగెటివ్ ప్రభావం పడుతోంది. ఈ ఏడాది ఎన్‌‌ఎస్‌‌ఈలోని ఐటీ సెక్టార్ ఇండెక్స్‌‌ 27 శాతం నష్టపోవడాన్ని గమనించాలి. టాప్ ఐటీ కంపెనీలయిన టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్ షేర్లు తమ ఏడాది కనిష్టాలకు చేరువలో ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌‌ ఏడాది కనిష్టం రూ. 2,973 కాగా, ఇన్ఫోసిస్‌‌ ఏడాది కనిష్టం రూ. 1,360.కొత్త ఇన్వెస్టర్లు పెద్ద బ్రాండ్‌‌లకు ముందుగా ఆకర్షితులవుతుంటారు. ఇప్పుడు ఐటీ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసేవారు ప్రస్తుత పరిస్థితులను వాడుకోవాలని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. షార్ట్ టెర్మ్ కోసం అయితే వద్దంటున్నారు. ఎందుకంటే మాక్రో ఎకనామిక్ పరిస్థితులు ఇప్పటిలో మెరుగు కావని, ఐటీ కంపెనీల డాలర్ రెవెన్యూ గ్రోత్ పెద్దగా ఉండదని వివరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే టీసీఎస్ షేరు 20 శాతం మేర, ఇన్ఫోసిస్ షేరు 27 శాతం మేర నష్టపోయాయి. ‘ఈ రెండు ఐటీ షేర్లు కూడా ఓవర్‌‌‌‌ సోల్డ్‌‌ (ఎక్కువగా అమ్ముడైన) జోన్‌‌లో ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ ఇండెక్స్ రికార్డ్ లెవెల్‌‌కు చేరుకుంటోంది. ఫలితంగా  రూపాయి విలువ పడుతోంది. రూపాయి పతనం ఐటీ కంపెనీలకు మేలు చేస్తుంది.  ఈ రెండు షేర్లు తిరిగి లేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత లెవెల్స్‌‌ను చూస్తే ఈ రెండు షేర్లలో టీసీఎస్‌‌ను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహాయిస్తా. రూ.2,750 లెవెల్‌‌ కిందకు వస్తే ఎగ్జిట్ అవ్వండి’ అని ఐఐఎఫ్‌‌ఎల్‌‌ సెక్యూరిటీస్‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌ అనుజ్‌‌ గుప్తా పేర్కొన్నారు. లాంగ్ టెర్మ్‌‌ కోసం షేర్లను కొంటున్న వారికి టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్ షేర్లను కచ్చితంగా తీసుకోవాల్సినవి అని ఎస్‌‌ఎంసీ గ్లోబల్‌‌ సెక్యూరిటీస్‌‌ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ ముడిట్ గోయెల్‌‌ అన్నారు. ఇన్ఫోసిస్‌‌కు రూ. 1,330 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని, రూ.1,460 దగ్గర  రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు. అదే టీసీఎస్‌‌కు రూ.2,960 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్‌‌, రూ.3,140 వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయన్నారు. కాగా, టీసీఎస్ గురువారం రూ.3,009 వద్ద, ఇన్ఫోసిస్‌‌ రూ.1,368 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు యూరప్‌‌, యూఎస్‌‌ క్లయింట్స్ తమ ఐటీ ఖర్చులు తగ్గించేస్తాయనే ఆందోళనలు పెరగడంతో టాప్ ఐటీ కంపెనీలు తమ హైరింగ్ ప్రాసెస్‌‌ను, బోనస్ యాక్టివిటీని ఆపేశాయి. 

యూఎస్‌‌‌‌, యూకేలు పెంచేశాయి..
పెరుగుతున్న ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కంట్రోల్ చేయడానికి యూఎస్‌‌ ఫెడ్‌‌ వడ్డీ రేట్లను మరో  75 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో  ఈ దేశంలో బెంచ్‌‌మార్క్ వడ్డీ రేటు 3.0–3.25 శాతం రేంజ్‌‌కు చేరుకుంది. వడ్డీ రేట్ల పెంపు సరియైన నిర్ణయమని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ అన్నారు. ఇన్‌‌ఫ్లేషన్‌‌ను తగ్గించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఐ) కూడా వడ్డీ రేట్లను భారీగానే పెంచింది. గ్యాస్ ధరలు పెరగడంతో రికార్డ్‌‌ లెవెల్‌‌కు చేరుకున్న ఇన్‌‌ఫ్లేషన్ తగ్గించేందుకు  వడ్డీ రేట్లను వరసగా రెండో మీటింగ్‌‌లోనూ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ దేశంలో వడ్డీ రేట్లు 2.25 శాతానికి పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు పెంచడం ఇది వరసగా ఏడో సారి కావడం విశేషం.

మంచి పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 
మిగిలిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌‌‌‌ల కంటే ఇండియా మంచి పొజిషన్‌‌‌‌లో ఉందని ఎస్‌‌‌‌ అండ్ పీ గ్లోబల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎకనామిస్ట్‌‌‌‌ పాల్‌‌‌‌ గ్రునేల్డ్‌‌‌‌ అన్నారు. ‘మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని అంచనావేస్తున్నా. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ర్యాంకింగ్ ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇండియా టాప్‌‌‌‌లో ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఎకానమీ ఎగుమతులపై కంటే లోకల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, అంతేకాకుండా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌‌‌‌గా లింక్ కాలేదని వివరించారు. ‘ఇండియాకు అతిపెద్ద డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌ ఉంది. సర్వీస్‌‌‌‌లు, ఐటీ మినహా గ్లోబల్ సప్లయ్ చెయిన్‌‌‌‌లో ఈ దేశ పాత్ర పెద్దగా లేదు. సర్వీస్‌‌‌‌లు సప్లయ్‌‌‌‌ చేస్తున్నప్పటికీ చైనా, యూరప్ దేశాల మాదిరి ఇతర దేశాల ఎకానమీలతో స్ట్రాంగ్‌‌‌‌గా ఇంటర్‌‌‌‌‌‌‌‌లింక్ కాలేదు’ అని గ్రునేల్డ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటు ఉండొచ్చన్నారు. డౌన్‌‌‌‌సైడ్ రిస్క్‌‌‌‌లు ఉన్నాయని వివరించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావం వచ్చే ఏడాది ఎక్కువగా ఉంటుందని, అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని గ్రునేల్డ్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి 3.3 శాతంగా ఉంటుందని ఎస్‌‌‌‌ అండ్ పీ గ్లోబల్‌‌‌‌ అంచనావేసింది. 

కిందకీ.. పైకీ చివరకు కిందకే
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరో 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో  గ్లోబల్‌‌ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌‌లు కూడా గురువారం సెషన్‌‌లో  నష్టపోయాయి. వీక్లి డెరివేటివ్‌‌ ఎక్స్‌‌పైరీ ఉండడంతో మార్కెట్‌‌లో వొలటాలిటీ కనిపించింది. నిఫ్టీ 50 ఇంట్రాడేలో 160 పాయింట్లు నష్టపోయి, తిరిగి రికవరీ అయ్యింది. చివరికి 89 పాయింట్లు పడి 17,630 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌‌ 337 పాయింట్లు నష్టపోయి (0.57 శాతం) 59,120 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ నష్టాల్లో సగం వాటా హెచ్‌‌డీఎఫ్‌‌సీ, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ షేర్ల వలనే వచ్చాయి. గురువారం సెషన్‌‌లో నిఫ్టీ బ్యాంక్‌‌, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఇండెక్స్‌‌లు 1.4 శాతం నష్టపోయాయి. ఐటీ, ఆటో షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు బ్రాడ్ మార్కెట్‌‌ మాత్రం సానుకూలంగా ట్రేడయ్యింది. నిఫ్టీ మిడ్‌‌క్యాప్ 100 ఇండెక్స్‌‌ 0.34 శాతం పెరగగా, నిఫ్టీ స్మాల్‌‌ క్యాప్100 ఇండెక్స్ 0.6 శాతం లాభపడింది. యూఎస్ బాండ్ ఈల్డ్‌‌లు పెరగడం, యూఎస్ డాలర్ ఇండెక్స్ రికార్డ్ లెవెల్ అయిన 111 కు చేరుకోవడంతో  ఇండియన్ రూపాయి విలువ గురువారం సెషన్‌‌లో డాలర్ మారకంలో ఆల్‌‌టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. రూపాయి విలువ 99 పైసలు తగ్గి  80.95 వద్ద సెటిలయ్యింది. ‘దేశ మార్కెట్‌‌లు తక్కువగానే నష్టపోయాయి. కానీ, రూపాయి పతనం ఇలానే కొనసాగితే స్వల్ప కాలంలో విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్‌‌ ఆకర్షణీయంగా అనిపించదు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.