పండిట్, పీఈటీలకు త్వరలో అప్‌‌గ్రేడేషన్ : టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

పండిట్, పీఈటీలకు త్వరలో అప్‌‌గ్రేడేషన్ : టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌‌గ్రేడ్ చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన శాసనసభ, మండలి షెడ్యూల్ తెగల అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలను మీడియాకు తెలిపారు.

గతం నుంచి పెండింగ్‌‌లో ఉన్న అప్‌‌గ్రేడేషన్ అంశంపై శ్రీపాల్ రెడ్డి వివరణ కోరగా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్ స్పందిస్తూ.. మరో రెండు, మూడు వారాల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల మంజూరు, గురుకుల, ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కోరారు.