V6 News

లాస్ట్ టెస్ట్ ఆడేదెట్ల..టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ

లాస్ట్ టెస్ట్ ఆడేదెట్ల..టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ

మహ్మద్‌‌ షమీ, ఉమేశ్‌‌ యాదవ్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌, రవీంద్ర జడేజా, హనుమ విహారి.. ఆసీస్‌‌ టూర్‌‌ సందర్భంగా గాయపడ్డ ఇండియా ప్లేయర్లు. షమీ, ఉమేశ్‌‌, రాహుల్‌‌ ఇప్పటికే ఇండియా వచ్చేయగా.. జడ్డూ, విహారి ఫోర్త్‌‌ టెస్టుకు దూరమయ్యారు.  ఇప్పుడీ లిస్ట్‌‌లో మరో ముగ్గురు ప్లేయర్లు చేరారు. పొత్తి కడుపులో నొప్పి కారణంగా జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, చేతికి బాల్‌‌ తగిలి మయాంక్‌‌, బ్యాక్‌‌ పెయిన్‌‌తో అశ్విన్‌‌ ఇబ్బంది పడుతున్నారు. బుమ్రా బ్రిస్బేన్‌‌ టెస్టులో ఆడబోడని బోర్డు వర్గాలు చెబుతుండగా.. అశ్విన్‌‌, మయాంక్‌‌ ఆడటం అనుమానమే. దాంతో, శుక్రవారం మొదలయ్యే  ఆఖరి మ్యాచ్‌‌కు  ఫిట్‌‌గా ఉన్న పదకొండు మందిని బరిలోకి దింపడమే టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు సవాల్‌‌గా మారింది. బోర్డర్‌‌-గావస్కర్‌‌ ట్రోఫీని రిటెయిన్​ చేసుకోవాలని  భావిస్తున్న టీమిండియాకు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడం లేదు.

సిడ్నీ:  అసాధారణ పోరాటంతో మూడో టెస్టును కాపాడుకున్న ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు షాక్‌‌.  సిడ్నీలో సత్తాచాటిన రవీంద్ర జడేజా, హనుమ విహారి ఇప్పటికే బ్రిస్బేన్‌‌ మ్యాచ్‌‌కు దూరమవగా.. తాజాగా పొత్తి కడుపులో నొప్పి కారణంగా జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా వైదొలిగాడు. అంతేకాకుండా బ్రిస్బేన్‌‌లో విహారికి రీప్లేస్‌‌మెంట్‌‌గా భావిస్తున్న మయాంక్‌‌ అగర్వాల్‌‌ కూడా గాయపడడం మరో దెబ్బ. నెట్‌‌ సెషన్‌‌లో ఓ బాల్‌‌ తగిలి అతని చేతికి దెబ్బతగిలింది. హెయిర్‌‌ లైన్‌‌ ఫ్రాక్చర్‌‌ అయినట్టుగా అనుమానిస్తున్నారు. ఇది చాలదన్నట్టు రవిచంద్రన్‌‌ అశ్విన్‌‌ బ్యాక్‌‌ పెయిన్‌‌ ఇంకా పెరిగింది.  శుక్రవారం గబ్బా స్టేడియంలో మొదలయ్యే ఆఖరి టెస్టులో ఆడటం అనుమానంగా మారింది. అందరికంటే ముఖ్యంగా ఇండియా పేస్‌‌ను నడిపిస్తున్న బుమ్రా గాయం మేనేజ్‌‌మెంట్‌‌ను కలవరపెడుతోంది. సిడ్నీ థర్డ్‌‌ మ్యాచ్‌‌ సందర్భంగా అతను ఇబ్బంది పడ్డాడు. చాలాసార్లు తన పొత్తి కడుపును పట్టుకుంటూ కనిపించాడు.  మ్యాచ్‌‌ తర్వాత స్కానింగ్‌‌ చేయించగా.. రిపోర్ట్స్‌‌లో స్ట్రెయిన్‌‌ ఉన్నట్టు తేలింది.  దాంతో, అది ఇంజ్యురీగా మారకూడదని భావిస్తున్న మేనేజ్‌‌మెంట్‌‌.. స్వదేశంలో  ఇంగ్లండ్‌‌తో టెస్టు సిరీస్‌‌ దృష్ట్యా బ్రిస్బేన్‌‌ మ్యాచ్‌‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని చూస్తోంది. ‘సిడ్నీ మ్యాచ్‌‌లో ఫీల్డింగ్‌‌ చేస్తుండగా బుమ్రా అబ్డామినల్‌‌ స్ట్రెయిన్‌‌ (పొత్తి కడుపులో నొప్పి)కు గురయ్యాడు. బ్రిస్బేన్‌‌ టెస్టులో అతను బరిలోకి దిగడం లేదు. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌కు మాత్రం అందుబాటులో ఉంటాడు’ అని బోర్డుకు చెందిన ఓ అధికారి చెప్పారు. బుమ్రా పొత్తి కడుపు కండరాల్లో  చీలిక లేకపోవడం టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశమే. అయితే, బ్రిస్బేన్‌‌ మ్యాచ్‌‌లో అతడిని ఆడించాలా? వద్దా? అనేదానిపై జట్టు సమాలోచనలు చేస్తోంది.

ఫైనల్‌‌ ఎలెవన్‌‌ ఎలా?

ఆసీస్‌‌ టూర్‌‌కు వచ్చిన టీమ్‌‌లో  సగం మంది  ఏదో ఒక గాయంతో బాధపడుతున్నారు. వారిలో కొందరు ఇప్పటికే ఇంటిదారి పట్టారు. ఈ నేపథ్యంలో  చివరి టెస్టులో బరిలోకి దింపేందుకు ఫిట్‌‌గా ఉన్న పదకొండు మందిని గుర్తించడమే మేనేజ్‌‌మెంట్‌‌కు సవాల్‌‌గా మారింది. గాయాలతో షమీ, ఉమేశ్‌‌ యాదవ్‌‌ ఇండియా వచ్చేయగా.. ఇప్పుడు బుమ్రా కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో  చివరి మ్యాచ్‌‌లో ఇండియా పేస్‌‌ అటాక్‌‌ మొత్తం కొత్తగా కనిపించనుంది. కేవలం రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న యంగ్‌‌ పేసర్‌‌, హైదరాబాదీ మహ్మద్‌‌ సిరాజ్‌‌ బ్రిస్బేన్‌‌లో ఇండియా పేస్‌‌ అటాక్‌‌ను నడిపించనున్నాడు. అతనికి తోడు నవదీప్‌‌ సైనీ, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, టి. నటరాజన్‌‌ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. సగం ఫిట్‌‌నెస్‌‌తోనే బుమ్రాను ఆడించి ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌ను రిస్క్‌‌లో పెడితే తప్ప… టి. నటరాజన్‌‌ టెస్టు అరంగేట్రం ఖాయమే అనొచ్చు. జడేజా ప్లేస్‌‌లో శార్దూల్‌‌ టీమ్‌‌లోకి రానున్నాడు. మ్యాచ్‌‌ టైమ్‌‌కు అశ్విన్‌‌ కోలుకుంటాడని మేనేజ్‌‌మెంట్‌‌ ఆశిస్తోంది. ఒకవేళ అతను ఫిట్‌‌నెస్‌‌ సాధించకుండా బ్రిస్బేన్‌‌లో స్పిన్నర్‌‌ కావాలనుకుంటే చైనామన్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ను లేదంటే నెట్‌‌ బౌలర్‌‌గా ఉన్న వాషింగ్టన్‌‌ సుందర్‌‌ను బరిలోకి దింపడం మినహా మరో అప్షన్‌‌ లేదు.  ఇక, గాయంతో కేఎల్‌‌ రాహుల్‌‌ ఇండియా తిరిగి రాగా,  గ్రేడ్‌‌ 2 ఇంజ్యురీకి గురైన విహారి ఫోర్త్‌‌ టెస్టు నుంచి తప్పుకోవడంతో మిడిలార్డర్‌‌లో టీమ్‌‌కు బ్యాకప్‌‌ ఆప్షనే లేకుండా పోయింది. టీమ్‌‌లో ఒక్క రిజర్వ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కూడా లేడు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌లో ఫామ్‌‌ కోల్పోయి  వేటు పడ్డ ఓపెనర్లు  పృథ్వీ షా, మయాంక్‌‌ అగర్వాల్‌‌  మాత్రమే అందుబాటులో ఉన్నారు. కానీ, విహారి ప్లేస్‌‌లో వస్తాడనుకున్న మయాంక్​ చేతికి దెబ్బ తగిలింది. హెయిర్‌‌లైన్‌‌ ఫ్రాక్చర్‌‌ అయినట్టు తేలితే అతను ఆడటం కష్టం. అప్పుడు పృథ్వీ షాను ఫైనల్‌‌ ఎలెవన్‌‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.  టాపార్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ కాబట్టి షాను వన్‌‌డౌన్‌‌లోనే ఆడించాల్సి ఉంటుంది. అప్పుడు పుజారా, రహానె నాలుగు, ఐదో స్థానాల్లోబ్యాటింగ్‌‌కు దిగాలి.  బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ మార్చడం వద్దనుకుంటే రిషబ్‌‌ పంత్‌‌ను స్పెషలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా తీసుకొని సాహాకు కీపింగ్‌‌ అప్పగించాల్సి ఉంటుంది.  బ్రిస్బేన్‌‌లో ఇండియా ఐదుగురు స్పెషలిస్ట్‌‌ బౌలర్లతో  బరిలోకి దిగితే మన పేస్‌‌ అటాక్‌‌  అనుభవం కేవలం మూడు టెస్టుల  పది బాల్స్‌‌ మాత్రమే కానుంది. ఇప్పటిదాకా సిరాజ్‌‌ రెండు, సైనీ ఒక టెస్టు ఆడగా.. తన అరంగేట్రం మ్యాచ్‌‌లో శార్దూల్‌‌ పది బాల్స్‌‌ మాత్రమే వేసి గాయపడ్డాడు. నటరాజన్‌‌కు ఇదే తొలి టెస్టు కానుంది.  గబ్బా మ్యాచ్ మొదలయ్యేలోపు గానీ.. ఆట మధ్యలో గానీ ఎవరైనా  కంకషన్‌‌కు గురైతే రీప్లేస్‌‌మెంట్‌‌ చేసేందుకు కూడా బ్యాకప్‌‌ ప్లేయర్లు లేకపోవడం గమనార్హం.

 

ఇండియా @ హాస్పిటల్‌‌ వార్డ్‌‌

ఒకరి తర్వాత మరొకరు అన్నట్టు ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో టీమిండియా హాస్పిటల్‌‌ వార్డును తలపిస్తున్నది. ఈ టూర్‌‌కు ఎంపికైన వారిలో గాయపడ్డ ప్లేయర్లు, ప్రస్తుతం వారి సిచ్యువేషన్‌‌ ఎలా ఉందో చూద్దాం.

ఇషాంత్‌‌ శర్మ

ఐపీఎల్‌‌ సందర్భంగా  పక్కటెముల గాయానికి గురైన పేసర్‌‌ ఇషాంత్‌‌ శర్మను తొలుత ఈ టూర్‌‌ నుంచి తప్పించారు. సిరీస్‌‌కు ముందు ఫిట్‌‌నెస్‌‌ సాధించినా.. కఠినమైన టెస్టులకు ముందు ఇంకొంత  విశ్రాంతి అవసరం అని తేల్చారు. ప్రస్తుతం కాంపిటీటివ్‌‌ క్రికెట్‌‌లోకి తిరిగొచ్చిన లంబూ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌‌తో  సిరీస్‌‌లో అతను బరిలోకి దిగుతాడు.

రోహిత్‌‌ శర్మ

ఐపీఎల్‌‌ లాస్ట్‌‌ లెగ్‌‌లో తొడ కండరాల గాయానికి గురైనా ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో ఆడాడు. కానీ, అప్పటికే ఆసీస్‌‌తో లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌లకు తప్పించారు. ఆ తర్వాత ఫిట్‌‌నెస్‌‌ ప్రూవ్‌‌ చేసుకోవడంతో టెస్టులకు ఎంపిక చేశారు. కానీ, క్వారంటైన్‌‌ రూల్స్‌‌ కారణంగా చివరి రెండు టెస్టులకు మాత్రమే అందుబాటులోకి వచ్చాడు. థర్డ్‌‌ మ్యాచ్‌‌లో ఫిఫ్టీ కొట్టాడు.

మహ్మద్‌‌ షమీ

అడిలైడ్‌‌ ఫస్ట్‌‌ టెస్టులో పాట్‌‌ కమిన్స్‌‌ షార్ట్‌‌ బాల్‌‌ తగిలి షమీ ముంజేయికి ఫ్రాక్చర్‌‌ అయ్యింది. దాంతో, మిగతా సిరీస్‌‌ నుంచి తప్పించారు. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లో ఆడడం కూడా అనుమానమే.

ఉమేశ్‌‌ యాదవ్‌‌

సెకండ్‌‌ టెస్టులో ఫీల్డింగ్‌‌ చేస్తుండగా ఉమేశ్‌‌  కాలి పిక్క కండరాలకు గాయమైంది. దాంతో, రిహాబిలిటేషన్‌‌ కోసం బెంగళూరు ఎన్‌‌సీఏకు పంపించారు. ఇంగ్లండ్‌‌తో సిరీస్ కల్లా కోలుకునే చాన్సుంది.

కేఎల్‌‌ రాహుల్‌‌

టెస్టు సిరీస్‌‌లో ఒక్క చాన్స్‌‌ రాని లోకేశ్‌‌ రాహుల్‌‌ ఎంసీజీ నెట్స్‌‌లో బ్యాటింగ్‌‌ చేస్తుండగా గాయపడ్డాడు. అతని మణికట్టుకు ఇంజ్యురీ అయింది. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌ వరకూ కోలుకుంటాడని ఇండియాకు పంపించారు.

రవీంద్ర జడేజా

సిడ్నీ టెస్టులో మిచెల్‌‌ స్టార్క్‌‌ షార్ట్‌‌ బాల్‌‌ తగిలి జడేజా ఎడమ చేయి బొటన వేలుకు ఫ్రాక్చర్‌‌ అయింది. బోన్‌‌ కూడా డిస్‌‌లొకేట్‌‌ కావడంతో రికవర్‌‌ అయ్యేందుకు రెండు నెలల టైమ్‌‌ పడుతుంది. దాంతో, ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌కు కూడా దూరమయ్యాడు.

రిషబ్‌‌ పంత్‌‌

సిడ్నీ టెస్ట్ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో కమిన్స్‌‌ బాల్‌‌ ఎడమ మోచేతికి బలంగా తగలడంతో సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో కీపింగ్‌‌ చేయలేకపోయాడు. అయితే, ఫ్రాక్చర్‌‌ లేదని తేలడంతో బ్యాటింగ్‌‌కు వచ్చాడు. బ్రిస్బేన్‌‌ మ్యాచ్‌‌లోనూ బరిలోకి దిగనున్నాడు.

హనుమ విహారి

సిడ్నీ టెస్టులో హీరోగా నిలిచిన విహారికి గ్రేడ్‌‌2 హ్యామ్‌‌స్ట్రింగ్‌‌ ఇంజ్యురీ (తొడ కండరాల్లో చీలిక) అయింది. నాలుగో టెస్టుతో పాటు ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌కు కూడా అతను దూరం అవుతున్నాడు.

మయాంక్‌‌ అగర్వాల్​ 

తొలి రెండు టెస్టుల్లో ఫెయిలవడంతో మూడో మ్యాచ్‌‌ నుంచి తప్పించిన మయాంక్‌‌ అగర్వాల్‌‌ నెట్స్‌‌లో బ్యాటింగ్‌‌ చేస్తుండగా.. బాల్‌‌ చేతికి తగిలింది. స్కానింగ్‌‌ రిజల్ట్‌‌ రావాల్సి ఉంది. ఫ్రాక్చర్‌‌ లేనట్టయితే కాస్త నొప్పి ఉన్నా కూడా తను ఫోర్త్‌‌ టెస్టులో బరిలోకి దిగేందుకు రెడీగా
ఉంటాడు.

జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా

సిడ్నీ టెస్ట్​ థర్డ్​ డే సాయంత్రం బౌండ్రీకి వెళ్తున్న బాల్‌‌ను ఆపే క్రమంలో బుమ్రా పొత్తి కడుపులో నొప్పితో బాధపడ్డాడు. అయినా బౌలింగ్‌‌ కంటిన్యూ చేశాడు. అయితే, పెయిన్‌‌ తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా నాలుగో టెస్టులో అతనికి రెస్ట్‌‌ ఇవ్వాలని చూస్తున్నారు.