శాన్‌ఫ్రాన్సిస్కో: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్‌సీ)లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో ఈ లీగ్‌లో ఆడుతున్న తొలి ఇండియన్ క్రికెటర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. గతంలో బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) సిడ్నీ థండర్స్ తరఫున ఆడాల్సి ఉన్నా.. గాయం కారణంగా తప్పుకున్నాడు.
2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యుడైన అశ్విన్.. టీమిండియా తరఫున టెస్ట్, వన్డేల్లో వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 65 టీ20ల్లో బరిలోకి దిగాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఐదుగురు బౌలర్లలో ఒకడిగా నిలిచిన అశ్విన్.. చెన్నై సూపర్‌కింగ్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ఆటలో అశ్విన్‌కు ఉన్న అపారమైన అనుభవం, వ్యూహాత్మక చతురత తమ జట్టుకు ఎంతో మేలు చేస్తుందని యూనికార్న్స్ ఫ్రాంచైజీ ధీమా వ్యక్తం చేసింది. ఎంఎల్‌సీ లీగ్‌లో ఆడుతున్న తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలవడం చాలా గొప్పగా ఉందని అశ్విన్ అన్నాడు. యూనికార్న్స్ జట్టుకు తొలి టైటిల్ అందించడమే తన ప్రధాన లక్ష్యమన్నాడు.
