
విరాట్ ఫటాఫట్
రెండో టీ20లో ఇండియా గెలుపు
రాణించిన ధవన్
డికాక్ శ్రమ వృథా
సొంతగడ్డపై సౌతాఫ్రికాపై గెలవలేదనే చెత్త రికార్డును ఇండియా టీమ్ తుడిచేసుకుంది. భారీ టార్గెట్ కాకపోయినా..కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 నాటౌట్) మరోసారి హిట్టవ్వడంతో.. రెండో టీ20టీమిండియా సొంతమైంది. అందరూ దృష్టిసారించిన రిషబ్ పంత్ ఫట్టయినా.. ధవన్ (31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో
40) మళ్లీ ఫామ్ లోకి రావడం శుభసూచకం. ఓవరాల్‌గా మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1–0 ఆధిక్యంలో నిలిచిన విరాట్‌సేన.. హోమ్ సిరీస్ కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది.
మొహాలీ: పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు మరో విజయం. లక్ష్య ఛేదనలో సఫారీ బౌలర్లను చితక్కొట్టిన విరాట్‌సేన.. బుధవారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ప్రొటీస్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. ముందుగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ డికాక్ (37 బంతుల్లో 8 ఫోర్లతో 52), బవ్యూమ (43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 49) రాణించారు. తర్వాత ఇండియా 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 బెంగళూరులో ఆదివారం జరుగుతుంది.
డికాక్ దూకుడు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఓపెనర్లలో హెండ్రిక్స్ (6) విఫలమైనా.. డికాక్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. సైనీ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి జోరు పెంచిన కెప్టెన్.. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. నాలుగో ఓవర్‌లో చహర్.. హెండ్రిక్స్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండోఎండ్‌లో సుందర్ రన్స్ కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో ప్రొటీస్ 39/1 స్కోరు చేసింది. రెండు ఎండ్‌ల నుంచి జడేజా, హార్దిక్‌ను బౌలింగ్‌కు దించిన కోహ్లీ.. డికాక్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ బవ్యూమ డీప్ స్క్వేర్ లెగ్‌లో భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. తర్వాత మరో రెండు ఫోర్లు బాదడంతో నాలుగు ఓవర్లలో 39 రన్స్ రావడంతో తొలి 10 ఓవర్లలో సఫారీ 78/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌లో జడేజా బంతిని బౌండరీకి తరలించిన డికాక్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
కోహ్లీ.. సూపర్ క్యాచ్
ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు ప్రొటీస్ సారథి పెవిలియన్ చేరాడు. సైనీ వేసిన షార్ట్ లెంగ్త్ ఆఫ్ కట్టర్‌ను డికాక్ మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ మిస్ కావడంతో బాల్.. బౌలర్ వెనుక గాలిలోకి లేచింది. మిడాఫ్ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చిన కోహ్లీ అమాంతం డైవ్ చేస్తూ మునివేళ్లతో బంతిని అందుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నాలుగు బంతుల తర్వాత డుసెన్ (1)ను జడేజా రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేయడంతో ప్రొటీస్ స్కోరు 90/3గా మారింది. సహచరులిద్దరు వెంటవెంటనే ఔటైనా.. అవతలి వైపు బవ్యూమ వీరోచితంగా పోరాడాడు. మిల్లర్ (18) కూడా సమయోచితంగా స్పందించాడు. భారీ షాట్లు కొట్టే అవకాశం లేనిచోట సింగిల్స్, డబుల్స్‌తో రన్‌రేట్‌ను కాపాడారు. 15 ఓవర్లలో 110/3 స్కోరుతో ఉన్న సఫారీలు తర్వాతి 4 ఓవర్ల (23 రన్స్)లో నిరాశపర్చారు. ఏడు బంతుల తేడాలో మిల్లర్, బవ్యూమా ఔట్‌కావడంతో నాలుగో వికెట్‌కు 36 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కానీ చివరి ఓవర్‌లో పెహుల్‌క్వాయో (8 నాటౌట్), ప్రిటోరియస్ (10 నాటౌట్) చెరో సిక్సర్ బాది 16 పరుగులతో మంచి ఫినిషింగ్ ఇచ్చారు.
కోహ్లీ, ధవన్ నిలకడ..
రెండో ఓవర్‌లోనే రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన రోహిత్ (12) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. ధవన్, కోహ్లీ దంచికొట్టారు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాను కీలక భాగస్వామ్యంతో గట్టెక్కించారు. ఈ ఇద్దరి సమన్వయంతో పవర్‌ప్లేలో 47 రన్స్ వచ్చాయి. 6, 7 ఓవర్లలో 10 పరుగులే వచ్చినా.. 9వ ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్‌లో చూడముచ్చటైన సిక్సర్‌తో కోహ్లీ జూలు విదిల్చాడు. అవతలి వైపు ధవన్ కూడా బౌండరీతో జోరు పెంచడంతో తొలి 10 ఓవర్లలో ఇండియా 79/1తో ముందుకెళ్లింది. 11వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ దిశగా దూసుకొచ్చిన ధవన్.. తర్వాతి ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద మిల్లర్ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 13వ ఓవర్‌లో స్కోరు 100కు చేరింది. కానీ కోహ్లీతో జతకలిసిన రిషబ్ (4) మరోసారి చెత్త షాట్‌కు ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (16 నాటౌట్) నిలకడగా ఆడటంతో 15 ఓవర్లలో స్కోరు 115/3కి చేరింది. పెహుల్‌క్వాయో వేసిన 17వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ 40— బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఇండియా గెలవాలంటే 18 బంతుల్లో 19 రన్స్ చేయాల్సిన దశలో రబడ బౌలింగ్‌లో విరాట్ రెండు సూపర్ సిక్సర్లు బాదితే.. అయ్యర్ ఫినిషింగ్ ఫోర్ కొట్టాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 47 రన్స్ జోడించి టీమ్‌ను గెలిపించారు.
1-0 ???? #TeamIndia wrap the 2nd T20I by 7 wickets #INDvSA @paytm pic.twitter.com/GW0FBddf3k
— BCCI (@BCCI) September 18, 2019