కరోనా సంక్షోభంలోనూ నియామకాలపై పలు కంపెనీల ఆసక్తి

కరోనా సంక్షోభంలోనూ నియామకాలపై పలు కంపెనీల ఆసక్తి

కోవిడ్ 19 ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా అన్నికంపెనీలకు తీవ్ర నష్టాలు వచ్చాయి. దాంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సంక్షోభంలోనూ కొన్ని సంస్థలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, కాంటాక్ట్ లెస్ టెక్నాలజీల్లో మంచి కొలువులను అందిస్తున్నాయి. కొవిడ్ సంక్షోభంలో కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ…. జాబ్స్ నుంచి తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. అయితే.. కొన్ని రంగాల్లోని కంపెనీలు మాత్రం కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.  క్లౌడ్  కంప్యూటింగ్ , కాంటాక్ట్ లెస్  టెక్నాలజీలు, డేటా ప్రాసెసింగ్ లాంటి విభాగాల్లో నియామకాలకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఎడ్యుటెక్ , లాజిస్టిక్స్ ,  ఆన్ లైన్  బ్యాంకింగ్ , ఫైనాన్షియల్  సర్వీసెస్ అందిస్తున్న ఫిన్  టెక్  కంపెనీలు కూడా నియామకాలు చేపడుతున్నాయని టెక్ అనలిస్ట్ లు చెబుతున్నారు. ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలు వెంటనే కోలుకోకపోయినా…. మిగిలిన రంగాల్లో కోవిడ్  సంక్షోభం ముగిశాక నియామకాలు పుంజుకుంటాయని అంటున్నారు. మెడిసన్స్, డిఫెన్స్, ఆన్  లైన్  లావాదేవీలు, లాజిస్టిక్స్  లాంటి రంగాలపైనా కోవిడ్  ప్రభావం లేదనీ.. ఈ రంగాలకు చెందిన కంపెనీలు నియామకాలు కొనసాగిస్తున్నాయంటున్నారు. వీటితో పాటు రిటైల్ , హెల్త్  కేర్  రంగాలకు ప్రొడక్ట్  లను అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ కంపెనీలు కూడా రిక్రూట్ మెంట్స్ చేపడుతున్నాయి.

కోవిడ్  ప్రభావంతో నియామకాలపై కంపెనీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నా…కోవిడ్ కి ముందున్న పరిస్థితితో పోలిస్తే నియామకాలు 50 శాతానికి చేరతాయంటున్నారు. కోవిడ్ -19 కారణంగా ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. కరోనా తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగనుంది. ఇంటర్నేషనల్ కంపెనీలు భారత్  లో రిక్రూట్ మెంట్ చేపట్టి.. ఇక్కడి నుంచే పని చేయించుకునే ఛాన్సుంది. సెప్టెంబరు-అక్టోబరు తర్వాత కూడా వర్క్  ఫ్రమ్  హోమ్  కి అవకాశం ఉన్న క్లౌడ్  కంప్యూటింగ్  లో నియామకాలు పెరిగే వీలుంది. టెలికామ్  రంగంలోని BPO విభాగంలోను భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.