V6 News

ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా నేడు ధర్నా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా నేడు ధర్నా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  •     ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాటానికి దిగారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో  మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యను వ్యాపారంగా మార్చిన సంస్థలపై ఆయన మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని గుర్తుచేశారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. "విద్య హక్కు - వ్యాపారం కాదు" అనే నినాదంతో జరిగే ఈ ధర్నాకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రావాలని మల్లన్న పిలుపునిచ్చారు.