కేసీఆర్ తీరు..చంపినోడే శవం పక్కన ఏడ్చినట్టుంది.. తీన్మార్ మల్లన్న

కేసీఆర్ తీరు..చంపినోడే శవం పక్కన ఏడ్చినట్టుంది.. తీన్మార్ మల్లన్న
  • ఏపీలో 7 మండలాల విలీనానికి అంగీకరించిందే కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే.. చంపినోడే శవం పక్కన కూర్చొని ఏడ్చినట్టు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు ఆనాడు సీఎం హోదాలో అంగీకరించిందే కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇప్పుడు వాటిని మళ్లీ వెనక్కి తీసుకురావాలని కోరడం, కృష్ణా జలాల్లో వాటా తీసుకురావాలనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం ఆ ఏడు మండలాలను తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమై, విభజన సమస్యలను పరిష్కరించుకోవడం శుభ పరిణామమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల ఉన్న ప్రేమతోనే సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారన్నారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

‘కేసీఆర్, జగన్ సీఎంలుగా ఉన్నప్పుడు ఇరువురు కలిసి ప్రజల సమస్యలు పరిష్కరించారా? ప్రగతి భవన్ లో ఏం మాట్లాడుకున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని వివాదాస్పదం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై విమర్శలు చేసే వాళ్లకు సిగ్గు లేదని, చిల్లర పనులు మానేసి ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. రాష్ట్రంలో వనరుల దోపిడీ చేసింది కేసీఆర్ కాదా? మల్లన్న ఫైర్ అయ్యారు.