V6 News

ఫీజుల నియంత్రణ చేతకాకపోతే గద్దె దిగాలి : తీన్మార్ మల్లన్న

ఫీజుల నియంత్రణ చేతకాకపోతే గద్దె దిగాలి : తీన్మార్ మల్లన్న
  •     ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీపై 'మహాధర్నా'లో తీన్మార్ ​మల్లన్న
  •     ఒక రైతు ఏడాది సంపాదన.. పిల్లల ఫీజుకే సరిపోతే ఎలా? అని ప్రశ్న
  •     విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు పేద పిల్లల చదువుల కలలను చిదిమేస్తున్నాయని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.  ఫీజుల దోపిడీపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో  ఆదివారం హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్క్ వద్ద 'మహాధర్నా' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం  వేలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యావ్యవస్థ  వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. "ప్రైవేటు చదువుల పేరుతో పేదవాడిని నిలువునా దోచుకుంటున్నారు. 

అడ్మిషన్లు, డొనేషన్లు, బస్సు ఫీజులు, మెటీరియల్ ఛార్జీలంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రైతు ఏడాది సంపాదించిన డబ్బు.. పిల్లాడి ఒక్క ఏడాది ఫీజుకే సరిపోతే  ఎలా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, ఫీజులను అదుపు చేయడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో కొత్తగా మరో 2500 ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వనున్నారని, సామాజిక అసమానతలను పెంచడమేనని మల్లన్న మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు మీడియాకు భారీగా యాడ్స్ ఇస్తూ, సమస్యలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కఠినంగా ఉన్నా, తెలంగాణలో మాత్రం నిబంధనలు లేకుండా వసూళ్లు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులపై కఠిన నియంత్రణ విధించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా దోపిడీ అంతమయ్యే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.