జీవో 59 పేరిట.. భూములు గుంజుకుంటున్నరు

జీవో 59 పేరిట.. భూములు గుంజుకుంటున్నరు

ఎల్​బీ నగర్, వెలుగు : 40 ఏళ్ల కిందట రిజిస్ట్రేషన్​ అయిన తమ భూములను జీవో 59 పేరుతో ప్రభుత్వ భూములుగా చూపుతూ గుంజుకుంటున్నారని హయత్ నగర్ డివిజన్ పద్మావతి కాలనీవాసులు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన చేశారు.  జీవో. 59 కింద లక్షల రూపాయలు కట్టాలని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ ప్రహరీలను కూల్చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.  వీరికి బీజేపీ నేతలు మద్దతుగా  బైఠాయించారు.  

వచ్చే ఎన్నికల ఖర్చును తీసుకునేందుకే  రాష్ట్రసర్కారు 58, 59 జీవోలను తీసుకొచ్చిందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. 2014లో సరైన గైడ్​ లైన్స్ లేకుండా 58, 59 జీవో తీసుకువచ్చారన్నారు. ఈ జీవోలతో  బీఆర్ఎస్ నేతలకు  తప్పా జనాలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మునుగోడు ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం118 జీవో తీసుకువచ్చి ప్రభుత్వం మోసగించిందని ఆయన మండిపడ్డారు. ఈ ధర్నాలో హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, నేతలు బండారి భాస్కర్, ఎల్లప్ప, రామేశ్వర్, సామ ప్రభాకర్ రెడ్డి, పారంద మహేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.