
వర్క్ టు రూల్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ప్రభుత్వం పై నమ్మకముందన్న టీజీటీఏ, ట్రెసా నాయకత్వం
ప్రభుత్వ ఒత్తిడి, తహసీల్దార్ లావణ్య అవినీతి కేసు ఎఫెక్ట్?
హైదరాబాద్, వెలుగు: బదిలీలు చేపట్టాలంటూ ఆందోళన చేపట్టిన తహసీల్దార్లు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ట్రాన్స్‌ఫర్ల విషయంలో ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని ప్రకటించారు. దీంతో ఈనెల 9 నుంచి నిర్వహిస్తున్న వర్క్ టు రూల్‌ను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన తమను తిరిగి పాత జిల్లాలకు పంపాలని కోరుతూ తహసీల్దార్ల సంఘం నాయకులు గతంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయినా స్పందించకపోవడంతో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) ఈనెల 6న ఆందోళనకు పిలుపునివ్వగా, ఆ తర్వాతి రోజే టీజీటీఏ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించింది.
ఈనెల 8న అన్ని జిల్లాల్లో కలెక్టర్లతోపాటు సీఎస్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పించింది. వీరి ఆందోళనపై సీరియస్‌గా ఉన్న సీఎస్ ఎస్‌కే జోషి టీజీటీఏ ప్రతినిధుల నుంచి వినతిపత్రం తీసుకునేందుకు కూడా టైమ్ ఇవ్వలేదు. మరుసటి రోజు నుంచి వర్క్ టు రూల్ పాటిస్తుండడం, సామూహిక సెలవుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు తహసీల్దార్, రెవెన్యూ సంఘాలపై సీరియస్ అయినట్లు తెలిసింది. నిరసన కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో వారు ఆందోళన విరమించుకున్నట్లు సమాచారం.
లావణ్య ఎఫెక్ట్?
మూడు రోజుల క్రితం కేశంపేట తహసీల్దార్ లావణ్య భారీ నగదుతో ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన కూడా తహసీల్దార్ల సంఘాల్లో ఆత్మస ్థైర్యాన్ని దెబ్బతీసినట్లు తెలిసింది. లావణ్య వ్యవహారంతో రెవెన్యూ శాఖలో అవినీతి, శాఖ ప్రక్షాళనపై మరోసారి చర్చ మొదలవడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవచ్చనే ఆందోళన వారిని వెంటాడినట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆందోళన చేయడం కంటే సామరస్య ధోరణితో వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 18, 19 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు, ఆగస్టు రెండో వారంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల తర్వాతే తహసీల్దార్ల బదిలీలు ఉండే అవకాశముందని తెలుస్తోంది.