పాట్నా: ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ స్థాపించి మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తన అన్న తేజ్ ప్రతాప్‌కు వ్యతిరేకంగా ఆదివారం (నవంబర్ 2) మహువా నియోజకవర్గంలో ఆర్జేడీ కీలక నేత, మహాఘట్బందన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మహువాలో తేజస్వీ ప్రచారం చేయడంపై తేజ్ ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహువాలో తనకు వ్యతిరేకంగా తన సోదరుడు తేజస్వీ యాదవ్ ప్రచారం చేయడని అనుకున్నానని అన్నారు. మహువాలో ఆర్జేడీ అభ్యర్థి తరుఫున తేజస్వీ ప్రచారం చేసిన పెద్ద ఒరిగేది ఏమి లేదని విమర్శించారు. తేజస్వీ యాదవ్ పోటీ చేస్తోన్న రాఘోపూర్‌లో నేను కూడా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. రాఘోపూర్‌లో నా క్యాంపెయినింగ్ తేజస్వీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. కృష్ణుడు లేకుండా అర్జునుడు గెలవలేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహువాలో తేజస్వీ ర్యాలీ సందర్భంగా ప్రజలపై లాఠీఛార్జ్ చేశారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. రాజకీయ పార్టీ కంటే ఏదీ పెద్దది కాదని తేజస్వీ అంటున్నాడు.. కానీ అది నిజం కాదని ప్రజలే అన్నింటికన్నా ముఖ్యమన్నారు. రఘోపూర్‌లో జేజేడీ అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు ఓటు వేయాలని తేజ్ ప్రతాప్ ప్రజలను కోరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లాలూ యాదవ్ ఫ్యామిలీలో చిచ్చురేపుతున్నాయి. తేజ్ ప్రతాప్, తేజస్వీ అన్నదమ్ముల మధ్య అధిపత్య పోరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
