బీహార్‎లో పీక్స్‎కు చేరిన పాలిటిక్స్: తేజ్ ప్రతాప్‎ను తరిమికొట్టిన ఆర్జేడీ కార్యకర్తలు

బీహార్‎లో పీక్స్‎కు చేరిన పాలిటిక్స్: తేజ్ ప్రతాప్‎ను తరిమికొట్టిన ఆర్జేడీ కార్యకర్తలు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంత పార్టీ పెట్టి ఆర్జేడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్‎కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తేజ్ ప్రతాప్‎ను ఆర్జేడీ కార్యకర్తలు, తేజస్వీ యాదవ్ మద్దతుదారులు తరిమికొట్టారు. లాలూ కుమారుడిని ఆర్జేడీ శ్రేణులు తరిమికొట్టడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

లాలూ ప్రసాద్, రబ్రీ దేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆర్జేడీ నుంచి అతడిని బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో జనశక్తి జనతాదళ్ అనే కొత్త పార్టీ స్థాపించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు తేజ్ ప్రతాప్. గతంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. తేజ్ ప్రతాప్ పార్టీ తరుఫున కొన్ని నియోజకవర్గాల్లో ఆయన మద్దతుదారులు పోటీ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే జనశక్తి జనతాదళ్ పార్టీ తరుఫున మహ్నార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై సింగ్ రాథోడ్ బరిలోకి దిగారు. తన పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేసేందుకు బుధవారం (అక్టోబర్ 29) తేజ్ ప్రతాప్ మహ్నార్ నియోజకవర్గానికి వెళ్లారు. మహ్నార్‌లోని హిరానంద్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో తేజ్ ప్రతాప్ ప్రసంగించారు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్‎కు వ్యతిరేకంగా ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 తేజస్వీ యాదవ్ జిందాబాద్ అంటూ తేజ్ ప్రతాప్ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో ఆర్జేడీ, జనశక్తి జనతాదళ్ పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో తేజ్ ప్రతాప్ ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్‎ను వెంబడించారు ఆర్జేడీ మద్దతుదారులు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.