- వడ్లకు 300, గోధుమలకు 400 చొప్పున బోనస్ ఇస్తామని వెల్లడి
పాట్నా: అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జనవరిలోనే మహిళల ఖాతాల్లో రూ.30 వేలు జమ చేస్తామని ఇండియా కూటమి సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ ప్రకటించారు. మంగళవారం పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. మేనిఫెస్టోలో తాము ప్రకటించిన ‘మాయి బెహిన్ మాన్ యోజన’ పథకానికి మంచి స్పందన వస్తున్నదని తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘‘నేను చాలా చోట్ల మహిళలతో మాట్లాడాను. వాళ్లంతా ‘మాయి బెహిన్ మాన్ యోజన’ పథకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కీమ్‌తో తమకు ఆర్థిక న్యాయం జరుగుతుందని మహిళలు చెబుతున్నారు.
ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఏటా రూ.30 వేల చొప్పున ఐదేండ్ల పాటు ఆర్థిక సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం. కానీ అక్కాచెల్లెళ్ల డిమాండ్ మేరకు ప్రతిఏటా ఇచ్చే రూ.30 వేలను ఒకేసారి వాళ్ల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించాం. మేం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది సంక్రాంతి రోజునే (జనవరి 14) మహిళల అకౌంట్లలో రూ.30 వేలు జమ చేస్తాం” అని తెలిపారు. అలాగే రైతులకు వడ్లకు క్వింటాల్‌కు రూ.300 చొప్పున, గోధుమలకు క్వింటాల్‌కు రూ.400 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు.
టీచర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగుల బదిలీలు చేపట్టి.. సొంత జిల్లాకు 70 కిలోమీటర్ల పరిధిలోనే పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే సర్కార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఇప్పటికే జమ చేసింది. దీనికి కౌంటర్‌గానే ఇండియా కూటమి కొత్త పథకం ప్రకటించింది.
