పంజాగుట్ట, వెలుగు: దళిత క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్, దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుందన్నారు. అనంతరం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తీర్పులు రాజ్యాంగానికి లోబడి ఉండాలని, హక్కుల సాధనలో దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దళిత క్రైస్తవ నాయకుడు బ్రహ్మన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబులు దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారని, ‘ఒకే జెండా –- ఒకే ప్రభుత్వం’ పేరిట దళితులను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో శ్రీనివాస్, యోసేబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

