
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కరోనా వైరస్ సోకుతోంది. సూర్యాపేట జిల్లాలో నాలుగు నెలల పసికందుకు మంగళవారం కరోనా పాజిటివ్ వచ్చింది. సూర్యాపేట సమీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన మహిళ ప్రసవం కోసం కోసం ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల క్రితం డెలివరీ అయిన ఆమెకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. అయితే 15 రోజుల క్రితం బాబుతో ఆమె కాసరబాద గ్రామానికి వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ పసివాడికి జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అజాగ్రత్త చేయడం మంచిదికాదని, ఆ చిన్నారిని హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్ప్రత్రికి తీసుకెళ్లారు. అనుమానంతో కరోనా టెస్టు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సూర్యాపేట పోలీసులు, వైద్యాధికారులు కాసరబాద గ్రామానికి చేరుకొని సంబంధిత కాలనీకి ప్రజల రాకపోకలను నిలిపివేశారు. వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు.