- ఎండల తీవ్రతపై సమీక్షలో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భానుడి భగభగలు, వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026’ను అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో 20 విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. ఈ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. జూన్ 15 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
24 గంటల్లోనే నీటి సమస్య పరిష్కారం
వచ్చే 45 రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులకు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నీటి సరఫరాలో మోటార్లు కాలిపోతే కేవలం 24 గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా రోజుకు 15 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
వడదెబ్బ తగిలి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే మానవతా దృక్పథంతో వ్యవహరించి, తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి హెచ్చరించారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, రెవెన్యూ విభాగాలు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆసుపత్రుల్లో 'కూల్ వార్డులు'
ప్రజారోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను భారీగా అందుబాటులో ఉంచాలని, ఎండదెబ్బ బాధితుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 'కూల్ వార్డులు' ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. అలాగే, నిర్మాణ రంగం, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం పనివేళల్లో మార్పులు చేయాలని, రొటేషన్ పద్ధతిలో వారికి విశ్రాంతి కల్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాల వద్ద షెల్టర్లు (నీడ) ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఏ చిన్న అజాగ్రత్త జరిగినా అధికారులనే బాధ్యులను చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
